హీరోయిన్లను మించిన హవా..ఆమె మరణం ఓ అంతుచిక్కని కథ

 హీరోయిన్లను మించిన హవా..ఆమె మరణం ఓ అంతుచిక్కని కథ

సిల్క్ స్మిత..సినీ ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయిన పేరు ఇది..ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించింది. సిల్క్ స్మిత.. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. తన మత్తుకళ్లు చూస్తే మతి చెదిరేది. తేనెలూరే పెదవులు నవ్వులు రువ్వితే గుండెలు లయ తప్పేవి. తీగ నడుమును కదుపుతూ ఆమె నాగినిలా నాట్యం చేస్తుంటే కళ్లు రెప్పలు వేయడం మర్చిపోయేవి. ఆమె ఉంటేనే సినిమా.

తనది హీరోయిన్లను మించిన హవా. తన డేట్స్ కోసం బడా హీరోస్ సైతం ఎదురుచూసేవాళ్ళు. తెలుగు నేలపై పుట్టి, సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ ను ఊర్రుతలుగుంచిన వడ్లపాటి విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత జయంతి నేడు. 1960, డిసెంబర్ 2న జన్మించిన ఆమె తెలుగు సినిమా హుషారైన పాటల్లో ఎవర్ గ్రీన్ లేడీ గా చిరస్మరణీయం. ఆమె ఈ లోకాన్ని వీడి 27 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

మేకప్‌ ఆర్టిస్ట్గా

సిల్క్ స్మిత తొలి చిత్రం బండి చక్రంలో తాను పోషించిన సిల్క్‌ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఈ అందాల ధ్రువ తార ఇండస్ట్రీలో మేకప్‌ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్‌ బీట్‌ లేనిదే ఒక్క సినిమా కూడా ఉండకపోయేది.

అందుకే ఆమెకు ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఉండటంతో హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంది. తన సినిమా కెరీర్లో మొత్తం 460 కి పైగా సినిమాల్లో నటించారు సిల్క్ స్మిత. ఇక ఆ తర్వాత 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికీ ఆమె మరణం ఓ అంతుచిక్కని కథలా మిగిలిపోయింది.