ఆడవాళ్లు ధరించే ఆభరణాల్లో బంగారానికి సాటిలేదు. కానీ, ఇప్పుడు వెండికీ గోల్డెన్ డేస్ వచ్చేశాయి. అందాన్ని రెట్టింపు చేయడంలో వెండి ఇప్పుడు బంగారంతో పోటీ పడుతోంది. తక్కువ బడ్జెట్‌లోనే గ్రాండ్ లుక్ వచ్చేలా హెవీ డిజైన్లు అందుబాటులో ఉండటంతో రోజురోజుకీ వెండి నగల క్రేజ్ పెరుగుతూనే ఉంది. సిల్వర్ జువెలరీ సంప్రదాయానికి మాత్రమే కాకుండా మోడ్రన్ ఫ్యాషన్ సింబల్‌గా మారిపోయింది. రీసేల్ వాల్యూ, వెరైటీ డిజైన్లలో ఉండటంతో సిటీలోనూ ఫ్యాషన్ ప్రపంచంలో వెండి ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది.
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. కస్టమర్ల దృష్టి వెండి నగలపై పడింది. ఒకప్పుడు సంప్రదాయ ఆభరణాలకే పరిమితమైన వెండి ఇప్పుడు ఫ్యాషన్ జువెలరీగా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్లలో బంగారం స్థానంలో వెండి ఆభరణాలు, ఆక్సిడైజ్డ్ జువెలరీ, గోల్డ్-ప్లేటెడ్ సిల్వర్ సెట్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లోని జువెలరీ షోరూంలు కూడా ప్రత్యేకంగా వెండి కౌంటర్లను విస్తరించాయి.
బ్రైడల్ కలెక్షన్స్‌కు డిమాండ్
హ్యాండ్ మేడ్ వెండి నగలతోపాటు బ్రైడల్ కలెక్షన్స్‌కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ‘‘నెక్లెస్, హారం, వడ్డాణం, చైన్, హ్యాంగింగ్స్, ఇయరింగ్స్ కలిపి బ్రైడల్ సెట్‌గా తక్కువ ధరకే లభిస్తున్నాయ’’ని అమైరా వెండి నగల షోరూం మేనేజర్ వీరబాబు చెప్పారు. ‘‘గతంలో వెండి విగ్రహాలు, గ్లాసులు, స్పూన్లు, డెకరేటివ్ ఐటెమ్స్ మాత్రమే అమ్మేవాళ్లం. కానీ నగలకు డిమాండ్ పెరగడంతో సిల్వర్‌తో వివిధ డిజైన్లలో జువెలరీ తయారుచేస్తున్నాం” అని గోల్డ్ షాప్ సేల్స్ మేనేజర్ ప్రకాష్ చెప్పారు. మనదగ్గరే కాదు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఎన్ఆర్ఐలు కూడా వెండి నగలే కొంటున్నారు.
‘‘విమానాశ్రయాల్లో కస్టమ్స్ తనిఖీలప్పుడు బంగారు నగల వల్ల ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఎన్ఆర్ఐలు వెండివైపు మళ్లుతున్నారు” అని సిల్వర్ జువెలరీ షాప్ సేల్స్ ఉమెన్ సంధ్య వివరించారు.
ఆక్సిడైజ్డ్ జువెలరీ
ఒకప్పుడు కాళ్ల పట్టీలకు మాత్రమే పరిమితమైన వెండి ఇప్పుడు మెడలో, చేతుల్లో, చెవుల్లో మెరుస్తోంది. తక్కువ ఖర్చుతో మోడర్న్ డిజైన్లలో వస్తుండడంతో హైదరాబాద్ యూత్‌కు సిల్వర్ లేదా ఆక్సిడైజ్డ్ జువెలరీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో, వెండి నగల క్రేజ్ కూడా అంతే ఉంది.
అలాగే ఆక్సిడైజ్డ్ జువెలరీ ట్రెండ్ కాలేజ్ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్ వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ జువెలరీ, కుర్తీలు, కాటన్ చీరలు, ఇండో-వెస్టర్న్ దుస్తులపైకి ఈ నల్లటి షేడ్ ఉన్న వెండి నగలు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నారు కస్టమర్స్.
వింటేజ్ డిజైన్లు
ట్రైబల్ డిజైన్లు, రాజస్థానీ ఆర్ట్‌వర్క్, టెంపుల్ జువెలరీ నమూనాలతో చేసిన వెండి నగలు
మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా వెండి నగలను ఎంకరేజ్ చేస్తుండడంతో డిమాండ్ మరింత పెరుగుతోంది. రాయల్ లుక్ ఇష్టపడేవాళ్ల కోసం పాతకాలపు నవాబీ స్టైల్ జుమ్కాలు, చాంద్‌బాలీలు, చోకర్లకు ఉండే పెద్ద పెద్ద వెండి నెక్లెస్‌లకు సిటీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు 92.5 స్టెర్లింగ్ సిల్వర్‌కు డిమాండ్ ఉంది.
సిల్వర్ జువెలరీకి కేరాఫ్..
సిటీలోని పలు ప్రాంతాలు సిల్వర్ జువెలరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ప్రత్యేకించి సిటీలోని పంజాగుట్టలో ఎమ్మడి సిల్వర్ జువెలరీ బ్రైడల్ సిల్వర్ కలెక్షన్స్‌కు పాపులర్ ప్లేస్ కాగా సంప్రదాయ డిజైన్ల నుంచి ఆధునిక డిజైన్ల వరకు ఇక్కడ లభిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ హై-ఎండ్ ప్రీమియం వెండి నగలు, వస్తువులకు ఫేమస్. రోజువారీ వాడకానికి, ఫంక్షన్లకి సరిపోయే బడ్జెట్ ఫ్రెండ్లీ వెండి నగలు కావాలంటే సికింద్రాబాద్‌లోని మయూక సిల్వర్ జువెలరీకి వెళ్లొచ్చు. ట్రెండీ డిజైన్లు, లైట్ వెయిట్ నగల కోసం పంజాగుట్టలోని లోటస్ సిల్వర్ జువెలరీ బెస్ట్ ఆప్షన్. అక్కడే క్వీన్స్ సిల్వర్ జువెలరీలో బ్రైడల్ డిజైన్లలు కస్టమైజ్ చేయించుకోవచ్చు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలోని ప్రీమియం డిజైనర్ సిల్వర్ షోరూంలు హై-ఎండ్ డిజైన్లను అందిస్తున్నాయి.
అబ్బాయిలు కూడా..
హైదరాబాద్‌లో ప్రస్తుతం వివిధ కొత్త డిజైన్ల వెండి నగలు యువతీ, యువకులు ధరించడం నేడు ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ‘‘అమ్మాయిలు వెండితో తయారుచేసిన నెక్లెస్‌లు, పెండెంట్స్, ఇయరింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువగా ధరిస్తున్నారు. మరోవైపు అబ్బాయిలు కూడా వెండి బ్రాస్ లెట్లు, దండలు, ముత్యాలు, రంగు రాళ్లు పొదిగిన ఉంగరాలు ధరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను మెషిన్లపై తయారుచేస్తుండటంతో వాటిని ధరిస్తే వాటివల్ల కొందరికి అలర్జీలు వస్తున్నాయి. దీంతో చాలామంది ఆడవాళ్లు ఇప్పుడు గిల్ట్ నగల స్థానంలో వెండి నగలను ధరించడానికి ఇష్టపడుతున్నార’’ని ఇస్మా వెండి జువెలరీ బ్రాండ్ డిజైనర్ శిరీష చెప్పారు.
