పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 26వ ర్యాంకర్ సుపనిదా కటెథాంగ్‌పై హోరాహోరీ పోరులో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన పోరులో సింధు 21-–-14, 8–-21, 23–-21తో ప్రత్యర్థిని ఓడించింది.
ఉత్కంఠ పోరులో పైచేయి
మ్యాచ్‌ను ధాటిగా ప్రారంభించిన సింధు తొలి గేమ్‌ను 21–-14తో సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో థాయ్ షట్లర్ బలంగా పుంజుకుంది. ర్యాలీల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ సింధును ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో సింధు 8-–21తో రెండో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరువురు క్రీడాకారిణులు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. చివరి దశలో ఒత్తిడిని అధిగమించిన సింధు కీలక పాయింట్లను గెలుచుకుంది.
చివరకు 23-–21తో గేమ్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌ను ముగించింది. గట్టి పోటీ ఎదురైనా పట్టుదలతో ఆడిన సింధు తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి ఉన్నతి హూడా ఓటమి పాలైంది. జపాన్ షట్లర్ రికో గుంజీతో జరిగిన పోరులో ఉన్నతి 18-–21, 21–-12, 17–-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకొని విజయం సాధించిన ఉన్నతి, నిర్ణయాత్మక గేమ్‌లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది.
