సింగరేణిలో తగ్గుతున్న ‘కారుణ్యం’..అన్‌‌ ఫిట్‌‌ కోసం అప్లై చేసుకున్నా పెరగని ఇన్‌‌వ్యాలిడేషన్

సింగరేణిలో తగ్గుతున్న ‘కారుణ్యం’..అన్‌‌ ఫిట్‌‌ కోసం అప్లై చేసుకున్నా పెరగని ఇన్‌‌వ్యాలిడేషన్
  •     హాజరైనవారిలోనూ ఇన్‌‌ వ్యాలిడేషన్​ కాని వారే ఎక్కువ 
  •     ఈ నెలలో జరిగిన మెడికల్​బోర్డులో 120 మందిలో 15 మందే ఇన్​వ్యాలిడేషన్​

కోల్‌‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు ప్రతికూల పరిస్థితుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ వ్యాధుల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో మెడికల్​బోర్డులో కార్మికుడు అన్‌‌ఫిట్‌‌ అయితే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల(ఇన్వాలిడేషన్​)కింద ఉద్యోగం వస్తుందని బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే నిరాశే ఎదురవుతోంది. నెలల తరబడి ఉద్యోగం వదులుకుని, జీతాన్ని త్యాగం చేసి బోర్డుకు దరఖాస్తు చేస్తే ఆఫీసర్లు కనికరం చూపకుండా ఫిట్‌‌ ఫర్‌‌‌‌ సేమ్​జాబ్​ అంటూ వెనక్కి పంపిస్తుండడంపై కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటీవల ఒక కాలు లేని వ్యక్తిని, కిడ్నీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని కూడా అన్‌‌ఫిట్​ చేయలేదు. దీంతో బాధితులు ఆర్‌‌‌‌ఎల్‌‌సీని ఆశ్రయించారు. ఈనెల 19న  మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట బొగ్గు గనిపై వెంకటేశ్​ అనే కార్మికుడు తనకు ఒక కాలు లేకున్నా అండర్ గ్రౌండ్​అన్‌‌ఫిట్‌‌ అని చెప్పి, సర్ఫేస్‌‌లో ఉద్యోగం చేయిస్తున్నారని కార్మిక సంఘాల లీడర్లను నిలదీయడం సింగరేణిలో చర్చనీయాంశమైంది. 

తగ్గుతున్న ఇన్​వ్యాలిడేషన్​

ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించిన మెడికల్​బోర్డులో కేవలం 15 మంది(12.5శాతం)ని మాత్రమే ఇన్వాలిడేషన్‌‌గా ప్రకటించారు. మూడు నెలలుగా మెడికల్​బోర్డులో ఇన్వాలిడేషన్​ శాతం తగ్గడంతో బోర్డు పట్ల కార్మికుల్లో ఆసక్తి తగ్గుతుంది. గతంలో ప్రతి నెల రెండు లేదా మూడు సార్లు మెడికల్‌‌ బోర్డులు నిర్వహించే యాజమాన్యం, ఇప్పుడు నెలకొకసారే నిర్వహిస్తున్నా తక్కువ మందిని అన్​ఫిట్​చేయడం విమర్శలకు తావిస్తోంది. బోర్డు నిర్వహణ కఠినతరం చేయడం, ముందస్తు సమచారం అందక కార్మికులు సకాలంలో చేరుకోకపోవడంతో ఇన్వాలిడేషన్​ శాతం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కనీసం వారం ముందు బోర్డు నిర్వహణపై సమాచారం ఇవ్వాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. మరోవైపు మెడికల్​ నిబంధనల ప్రకారం పారదర్శకంగా బోర్డు నిర్వహిస్తుండటంతో ఇన్వాలిడేషన్​ సంఖ్య తగ్గుతుందనే వాదనా ఉంది. మరోవైపు గతంలో దళారుల వల్లే ఇన్‌‌వ్యాలిడేషన్​పెరిగేదని అధికారులు చెబుతున్నారు. డాక్టర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడినట్లు ఎంక్వైరీలో తేలింది. అనర్హులను అన్‌‌ఫిట్‌‌గా ప్రకటించారనే ఆరోపణలతో విజిలెన్స్​విచారణ కూడా చేపట్టి పలువురిపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంది. దీంతో సింగరేణి డాక్టర్లకు బదులుగా ప్రభుత్వ డాక్టర్లను రప్పించి మెడికల్​బోర్డును నిర్వహిస్తున్నారు. 

  • సింగరేణిలో ఏడాదిన్నరగా నిలిపివేసిన మెడికల్​బోర్డును జూలై నుంచి నిర్వహిస్తున్నారు. ఆ నెల 17,18 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన హాస్పిటల్‌‌లో మెడికల్​బోర్డుకు 120 మంది హాజరుకాగా, 24 మంది(20శాతం) మాత్రమే ఇన్‌‌వ్యాలిడేషన్​ అయ్యారు. ఈ మెడికల్​బోర్డుకు 49 మంది గైర్హాజరుకావడం గమనార్హం. తక్కువ మందినే ఇన్వాలిడేషన్​ ప్రకటించారని కార్మికులు, కార్మిక సంఘాల లీడర్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు. 
  • ఆగస్టు 26,27 తేదీల్లో నిర్వహించిన మెడికల్​బోర్డుకు 120 మంది కార్మికులు దరఖాస్తులు చేసుకోగా 71 మంది హాజరయ్యారు. ఇందులో 12 మందిని ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉందంటూ నిర్ధారించి ఇన్వాలిడేషన్​ చేశారు. కేవలం 10శాతమే ఇన్వాలిడేషన్​ చేయటం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారిని కార్మికులు పేర్కొన్నారు. కనీసం సెప్టెంబర్​లోనైనా ఎక్కువ మంది కార్మికులను ఇన్వాలిడేషన్​ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఈసారి కూడా 12.5 శాతం మాత్రమే ఇన్వాలిడేషన్​ చేశారు. ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించిన మెడికల్​బోర్డుకు 120 మంది దరఖాస్తు చేసుకోగా 69 మంది మాత్రమే హాజరుకాగా.. 15 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్​ చేశారు. 38 మందిని ఫిట్​ఫర్​ సేమ్​జాబ్​, ఐదుగురిని హయ్యర్​ రిఫరల్‌‌కు, 11 మంది పిట్​ఫర్​సర్ఫేస్‌‌కు ఎంపిక చేశారు.