సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు

సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు
  • 15న జమ చేయనున్న యాజమాన్యం
  • పర్మినెంటు వర్కర్లకు  రూ.25 వేలు
  • ట్రైనీ, టెంపరరీలకు రూ.12,500 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం గుడ్​న్యూస్​ చెప్పింది. దసరా పర్వదినం సందర్భంగా పండుగ అడ్వాన్స్​మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో పనిచేస్తున్న నేషనల్​కోల్​వేజ్​అగ్రిమెంట్(ఎన్​సీడబ్ల్యూఏ) రెగ్యులర్​ఉద్యోగులతో పాటు మైన్స్​యాక్ట్​ కింద లీవ్​అర్హత గల ఉద్యోగులకు రూ.25 వేల చొప్పున పండుగ అడ్వాన్స్​ అందనుంది. టెంపరరీ కార్మికులు, ట్రైనీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున చెల్లిస్తారు. ఈనెల 15న నేరుగా ఉద్యోగుల బ్యాంక్​ ఖాతా జమ చేయనున్నారు. 

ఈ అడ్వాన్స్​మొత్తాన్ని కార్మికుల నుంచి10  వాయిదాల్లో  రికవరీ చేస్తారు. నవంబర్​నెల జీతాల నుంచి వాయిదాల వసూలు  ప్రారంభమవుతుంది. రిటైర్మెంట్​కాబోతున్న, వైద్యపరంగా అన్​ఫిట్​గా ప్రకటించిన ఉద్యోగులకు  అడ్వాన్స్​ఇవ్వరు. ఒక వేళ ఉద్యోగులు సర్వీసు 10 నెలల కంటే తక్కువగా ఉంటే  రిటైర్​నాటికన్నా ముందే  అడ్వాన్స్​ మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేస్తారు. గతేడాది పండుగ అడ్వాన్స్​ తీసుకొని  బకాయిలు  పూర్తిగా చెల్లించనివారికి పాత బాకీ  మినహాయించుకుంటారు. సింగరేణిలో ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులు సుమారు 37,478 మంది ఉన్నారు. పండుగ వేళ అడ్వాన్స్ జమ కానుండటంతో సింగరేణి కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.