సింగరేణిలో తేలని లాభాల వాటా!..బోనస్  కోసం కార్మికుల ఎదురుచూపులు

సింగరేణిలో తేలని లాభాల వాటా!..బోనస్  కోసం కార్మికుల ఎదురుచూపులు
  • ఆరు నెలలు గడిచినా నో క్లారిటీ
  • బకాయిలు వసూలు కాకపోవడం వల్లే ఆలస్యం?

కోల్‌‌‌‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు ప్రతి ఏడాది అందే లాభాల వాటా ప్రకటనపై ఈసారి ఎదురుచూపులు మిగిలాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు ఆరు నెలలు పూర్తయినా లాభాల వాటాపై సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఏటా దసరా పండుగకు ముందే లాభాల్లో వాటా(బోనస్‌‌‌‌) పంచడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌ 22నే 34 శాతం వాటాను ప్రభుత్వం ప్రకటించింది.

కేవలం కరోనా సమయంలో మాత్రమే అక్టోబర్‌‌‌‌లో ప్రకటన చేశారు. ఏటా ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి మార్చి 31 వరకు సింగరేణి ఉత్పత్తి సంవత్సరంగా పరిగణించి లాభనష్టాలను లెక్కిస్తారు. యాజమాన్యం లాభాలను వెల్లడించిన తర్వాత అందులో కార్మికులకు ఎంత శాతం వాటా ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి మరో 20 నుంచి 25 రోజులు పడుతుంది.

లాభాల వివరాలను వెల్లడించకపోవడంపై సింగరేణిలో చర్చ జరుగుతోంది. విద్యుత్‌‌‌‌ సంస్థల నుంచి సింగరేణికి వేల కోట్ల బకాయిలు వసూలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే లాభాల ప్రకటనలో జాప్యం జరుగుతోందా అనే ప్రచారం కూడా ఉంది. అక్టోబర్‌‌‌‌ 20న దసరా పండుగ ఉన్నప్పటికీ ఇప్పటివరకు లాభాల పంపిణీపై స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు వాస్తవ లాభాలను ప్రకటించి 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి.

ఆదాయం తగ్గిందా?

2024–25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.6,394 కోట్ల పన్ను మినహా లాభాన్ని ఆర్జించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇందులో కొంత మొత్తాన్ని అభివృద్ధి పనులకు కేటాయించినట్లు చెప్పి రూ.802 కోట్ల నుంచి కార్మికులకు 34 శాతం వాటాను ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.95 లక్షల వరకు బోనస్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు రూ.5,500 చెల్లించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్‌‌‌‌ టన్నులు కాగా, అందులో 12 మిలియన్‌‌‌‌ టన్నుల మేర వెనుకంజలో ఉంది.

కేవలం 58 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి 62 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేసింది. ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయకపోవడంతో ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ రూ.2 వేల కోట్ల మేర లాభాలు ప్రకటించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020–21లో 29 శాతం, 2021–22లో 30 శాతం, 2022–23లో 32 శాతం, 2023–24 33 శాతం, 2024–25లో 34 శాతం వాటాను కార్మికులకు చెల్లించారు.

పేరుకుపోయిన బకాయిలు..

సింగరేణి బొగ్గుతో పాటు విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 90 శాతం పవర్‌‌‌‌ ప్లాంట్లకు సరఫరా చేస్తోంది. ప్రధానంగా తెలంగాణ జెన్‌‌‌‌కోకు పంపిణీ చేయడంతో పాటు ఏపీ జెన్‌‌‌‌కో, మహాజెన్‌‌‌‌కో, కర్నాటకలోని కేపీసీఎల్‌‌‌‌, ఎన్‌‌‌‌టీపీసీ, టీఎన్‌‌‌‌పీజీసీఎల్‌‌‌‌ వంటి కంపెనీలకు బొగ్గును విక్రయిస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ వద్ద నెలకొల్పిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌‌‌‌ కేంద్రం(ఎస్టీపీపీ)లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌‌‌‌ను తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కోకు విక్రయిస్తుంది.

ఇలా విక్రయించిన విద్యుత్‌‌‌‌, బొగ్గుకు సంబంధించిన బకాయిలు 2014 నుంచి 2026 ఏప్రిల్‌‌‌‌ నాటికి రూ.54,289 కోట్ల మేరకు పేరుకుపోయాయి. ఎస్టీపీపీలో 2016లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు విక్రయించిన విద్యుత్‌‌‌‌కు తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కో రూ.28,791 కోట్లు, తెలంగాణ జెన్‌‌‌‌కో రూ.22,572 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సంస్థ నెలవారీ నిర్వహణ వ్యయం, వేతనాల కోసం యాజమాన్యం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

రూ.1,700 కోట్లకు పైగా అవసరం..

దసరా పండుగకు ముందు ఒక్కో ఉద్యోగికి రూ.25 వేల అడ్వాన్స్‌‌‌‌ రూపంలో సుమారు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీపావళి పండుగకు ముందు చెల్లించే పీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌(ప్రతిభ ఆధారిత చెల్లింపు–పెర్ఫార్మెన్స్‌‌‌‌ లింక్డ్‌‌‌‌ రివార్డ్‌‌‌‌)ను కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఉద్యోగికి రూ.1.03 లక్షల చొప్పున చెల్లించగా, ఈ సంవత్సరం మరికొంత ఎక్కువగా చెల్లించాల్సి వస్తే సంస్థకు దాదాపు రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు అవసరం అవుతుంది.

నెలవారీ వేతనాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లాభాల వాటా, పీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ బోనస్‌‌‌‌, దసరా అడ్వాన్స్‌‌‌‌, నెలవారీ వేతనాల రూపంలో అక్టోబర్‌‌‌‌లోనే దాదాపు రూ.1,700 కోట్లకు పైగా అవసరం అవుతుందని అంచనా. దాదాపు 40 వేల మంది ఉద్యోగులు, 30 వేల మంది కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు బోనస్‌‌‌‌ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.55 వేల కోట్ల బకాయిలు వసూలు కాకపోవడంతో సింగరేణి సంస్థ ఈ చెల్లింపులు ఎలా చేయాలోనని తల పట్టుకుంటోంది.