బారికేడ్లు దాటి.. గేట్లు దూకి జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి సీజేపీ 

బారికేడ్లు దాటి.. గేట్లు దూకి  జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి సీజేపీ 
  •     మెరుపు నిరసన చేపట్టిన కార్యకర్తలు
  •     నిరసన స్థలంగా రద్దైన మరుసటి రోజే ఆందోళన
  •     సీజేపీ నేతలు అశుతోశ్​ రంకా, దాస్ అరెస్ట్
  •     ప్రతిఘటనను డీనోటిఫై చేయలేరు: దీప్కే
  •     దేశమంతా జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పుట్టుకొస్తాయని వ్యాఖ్య

 

న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరసన స్థలంగా కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసిన మరుసటి రోజే అక్కడ  సీజేపీ కార్యకర్తలు మెరుపు నిరసనకు దిగారు. పార్టీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో కొందరు కార్యకర్తలు మంగళవారం తెల్లవారుజామునే జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.  

చేతుల్లో జెండాలతో  పోలీసు బారికేడ్లను దాటుకొని  గేటు దూకి లోపలికి ప్రవేశించారు. అక్కడ మోహరించిన పోలీసులు వారిని వెంబడించగా, కార్యకర్తలు భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ప్రధానిలో భయం కనిపిస్తోంది: దీప్కే

ప్రతిఘటనను డీనోటిఫై చేయలేరంటూ కేంద్రం ఉత్తర్వులకు దీప్కే సవాల్ విసిరారు. జంతర్ మంతర్‌‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడంలోనే ప్రధానమంత్రి భయం స్పష్టమవుతోందని విమర్శించారు. జంతర్ మంతర్ లేకపోతే నిరసనలు ఆగిపోతాయని ప్రధాని మోదీ భావిస్తున్నారని, కానీ అలా జరగదని, ఇకపై దేశవ్యాప్తంగా జంతర్ మంతర్‌‌లు పుట్టుకొస్తాయని వ్యాఖ్యానించారు.