నిద్రలేమితో… మగవాళ్లకు ఆడవాళ్ల లక్షణాలు

నిద్రలేమితో… మగవాళ్లకు ఆడవాళ్ల లక్షణాలు

నిద్ర, ఆహారం మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నిద్ర లేమితో అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అంతేకాదు దీనివల్ల ‘మగవాళ్లకు ఆడవాళ్ల లక్షణాలు వస్తాయి’ అంటున్నారు వైద్యులు. ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పోర్నోగ్రఫి ప్రభావంతో యువతలో ‘హోమో సెక్స్‌’ ప్రవర్తన కూడా పెరుగుతోంది అంటున్నారు. ఇది ఇలా కొనసాగితే మెట్రో నగరాల్లో జంబలకడిపంబ సినిమాలోని సీన్లు రియల్​ లైఫ్ లో కూడా కనిపిస్తాయేమో!

యంత్రం లాంటి మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. జీవ గడియారం ప్రకారం ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంలో చేయాలి. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. రాత్రంతా మేల్కొని, పొద్దంతా పడుకున్నా హార్మోన్ల విడుదలలో తేడా వస్తుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మగవాళ్లలో రాత్రి పూట టెస్టో స్టిరాన్‌ లాంటి ‘లైంగిక’ హార్మోన్లు విడుదలవుతాయి. రాత్రి పూట (ముఖ్యం గా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు) మేల్కొని ఉంటే, టెస్టో స్టిరాన్‌ ఉత్పత్తి తగ్గిపోయే ముప్పు ఉంటుంది. అదే సమయంలో మగవాళ్ల శరీరంలో ఉండే ఆడవాళ్లకు సంబంధించిన ఈస్ర్టడయాల్‌ (ఈ2) హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో ఆడవాళ్ల లక్షణాలు వస్తాయి. ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. అయితే, అతికొద్ది మందిలో మాత్రమే ఇలా జరుగుతుందని ఆండ్రాలజిస్ట్‌‌ డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి చెప్తున్నారు. ఆల్కా హాల్‌ అధికంగా తీసుకోవడం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, స్మార్ట్​ఫోన్ల రేడియేషన్‌, జంక్ ఫుడ్, విటమిన్‌ –డి లోపం, కాలుష్యం .. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఇవే కారణాల వల్ల ఆడవాళ్లలోనూ ‘మేల్‌ హార్మోన్లు’ పెరుగుతున్నాయని, పీసీఓడి, అవాంఛిత రోమాలు వస్తుండడం ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లేనని గైనకాలజిస్ట్‌‌ డాక్టర్‌ శకుంతల తెలిపారు.

ఆలోచనలో మార్పు
అధికశాతం మగవాళ్లు టెస్టో స్టిరాన్‌ హార్మోన్‌ కేవలం శృంగారం కోసమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ, శరీరంలోని అనేక అవయవాలపై టెస్టో స్టిరాన్‌ ప్రభావం ఉంటుందని సీనియర్ ఆండ్రాలజిస్ట్‌‌, డాక్టర్‌ కృష్ణ చైతన్య అంటున్నారు. ‘మారుతున్న జీవనశైలి వల్ల దశాబ్ద కాలంగా హార్మోన్ల అసమతుల్యత పెరుగుతూ వస్తోంది. టెస్టో స్టిరాన్‌ తగ్గితే బ్రెస్ట్‌‌ సైజ్‌ ఉండాల్సిన దానికంటే ఎక్కువవుతుంది. ఇలా మగవాళ్లలో బ్రెస్ట్‌‌ పెరగడాన్ని ‘గైనకోమాస్టియా’ అంటారు. మరోవైపు టెస్టో స్టిరాన్‌ లోపంతో మెదడుపై ప్రభావం పడి, ఆలోచనల తీరు మారుతుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. శుక్రకణాల ఉత్పత్తితోపాటు గుండె సరిగ్గా పనిచేయడానికి, కొలెస్ర్టాల్‌ కంట్రోల్‌ లో ఉండడానికి, ఆలోచన విధానం సరైన రీతిలో ఉండడానికి, మెంటల్‌ హెల్త్‌‌ సక్రమంగా ఉండడానికి కూడా టెస్టో స్టిరాన్‌ అవసరం. టెస్టో స్టిరాన్‌ తగ్గిపోయినవాళ్లలో ఒబేసిటి పెరుగుతుంది. కండరాల శక్తి, చురుకుదనం తగ్గిపోతుంది. ఎముకలు వీక్‌‌ అవుతాయి. టెస్టో స్టిరాన్‌ సమస్య దీర్ఘకాలం కొనసాగితే చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. లైంగిక ఇబ్బందులు, సంతానలేమి సమస్య పెరగడంలో టెస్టో స్టిరాన్‌ లోపమే ప్రధాన కారణం’ అని ఆయన చెప్పారు. టెస్టో స్టిరాన్‌ లోపాన్ని వ్యాయామం, సరైన ఆహార నియమాలతో అధిగమించవచ్చు అని కృష్ణ చైతన్య అంటున్నారు. ఎక్సర్‌ సైజ్‌ తో టెస్టో స్టిరాన్‌ ఉత్పత్తి సమపాళ్లలో ఉంటుందని, కనీసం వారానికి ఒకసారైనా వ్యాయామం చేస్తూ, పోషకాహారం తీసుకోవాలని ఆయన సూచించారు.

తగ్గుతున్న శుక్రకణాల ఉత్పత్తి
గతంలో ఆడవాళ్లలోనే సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. ఆధునిక జీవన విధానంలో స్మార్ట్‌‌ఫోన్లు, పని ఒత్తిడి పెరిగి మగవాళ్లలో శుక్రకణాల ఉత్పత్తి, సెక్స్‌‌పై ఆసక్తి తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మగవాళ్లలో సమస్యల కారణంగానే 35–40శాతం జంటలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయని శకుంతల వెల్లడించారు. ఇందులోనూ అధికశాతం శుక్రకణాల కౌంట్ తక్కువగా ఉన్న వాళ్లే ఉన్నారని, హైడ్రోసీల్‌ , వెరికోసీల్‌ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నవాళ్లు కొద్ది శాతమేనని ఆమె వివరించారు. మగవాళ్లలో పెరుగుతున్న పని ఒత్తిడి, హైపర్‌ టెన్షన్‌ తో స్పెర్మ్‌‌ ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోతున్నాయని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అంటున్నారు. ఇన్​ఫెర్టిలి టీ(వ్యంధత్వ) సమస్య రోజు రోజుకూ పెరిగిపోవడానికి ఒత్తిడే ముఖ్య కారణమని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ర్టంలో 10 నుంచి 15 శాతం మంది మగవాళ్లు ఏదో ఒక స్థాయిలో వ్యంధత్వ సమస్యను ఎదుర్కొంటుండడం గమనార్హం. దీంతో హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా మగవాళ్ల కోసమే నిర్వహించే ‘మెన్స్‌‌ క్లినిక్స్’ సంఖ్య పెరుగుతోంది.