- నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ల రీసెర్చ్‌లో వెల్లడి
- బెంగళూరు గర్భగుడి ఐవీఎఫ్ సెంటర్లో 300 మందిపై స్టడీ
- పొగతాగే వారిలో వీర్య కణాల తల, తోక భాగాల్లో లోపాలు
- సిగరెట్ మానకుంటే ఐవీఎఫ్ చేయించినా ఫలితం ఉండదు
హైదరాబాద్, వెలుగు: సిగరెట్ అలవాటు ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ, ఆ అలవాటు మగాళ్లను తండ్రులు కాకుండా చేసే ప్రమాదం ఉందని రీసెంట్ రీసెర్చ్ హెచ్చరించింది. పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు.. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బెంగళూరులోని ప్రసిద్ధ గర్భగుడి ఐవీఎఫ్ సెంటర్ వేదికగా మన రాష్ట్ర డాక్టర్లు నిర్వహించిన అధ్యయనంలో ధూమపానం వల్ల వీర్య కణాల నాణ్యత ఏ విధంగా పడిపోతుందో వెల్లడించారు. నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అమేరా అఫ్రోజ్, ఖమ్మం మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ డి. చండిప్రియ, సూర్యాపేట మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సీ. లావణ్య సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు.
వీరు ఐవీఎఫ్ సెంటర్ లోని క్లినికల్ ఎంబ్రియాలజీ విభాగంలో అందుబాటులో ఉన్న రికార్డులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. సంతానలేమితో బాధపడుతున్న పురుషులలో సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ క్లినికల్ స్టడీ స్పష్టం చేసింది.
కౌంట్ ఉన్నా.. క్వాలిటీ సున్నా..
ఈ పరిశోధన కోసం ఐవీఎఫ్ సెంటర్ కు వచ్చిన 300 మంది పురుషులను నిపుణులు పరిశీలించారు. వీరిలో 150 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు కాగా, మిగిలిన 150 మంది ఆ అలవాటు లేనివారు. వీరి సగటు వయస్సు 34 నుంచి 35 ఏండ్లు. పరీక్షల అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం.. సిగరెట్ తాగే వారిలోనూ, తాగని వారిలోనూ వీర్య కణాల సంఖ్య, కదలిక, వీర్యం పరిమాణం దాదాపు ఒకేలా ఉన్నట్టు కనిపించింది.
సిగరెట్ తాగే వారిలో కణాల సాంద్రత 51.7 మిలియన్లు ఉంటే, తాగని వారిలో 55.9 మిలియన్లుగా ఉంది. అయితే, ఈ తేడా పెద్దగా ప్రభావం చూపేది కాకపోయినప్పటికీ, కణాల అంతర్గత నాణ్యతలో మాత్రం భారీ తేడాలు కనిపించాయి. ముఖ్యంగా వీర్యంలోని పీహెచ్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల కణాలు జీవించే సామర్థ్యం తగ్గుతున్నట్టు గుర్తించారు.
ఆకృతి మారితే కష్టమే..
వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటేనే అవి అండాన్ని చేరుకుని ఫలదీకరణ చెందగలవు. అయితే, పొగతాగే వారిలో వీర్య కణాల ఆకృతి దెబ్బతింటున్నట్టు ఈ స్టడీలో తేలింది. కణాల తల భాగంలో లోపాలు, మెడ భాగంలో సమస్యలు, తోక భాగంలో వంకరలు వంటివి సిగరెట్ తాగే వారిలో ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.
ఈ లోపాల వల్ల కణాలు అండం వైపు వేగంగా ప్రయాణించలేవని, ఒకవేళ చేరుకున్నా ఫలదీకరణం చెందే శక్తి ఉండదని వైద్యులు వివరిస్తున్నారు. తెల్ల రక్త కణాల సంఖ్య రెండు వర్గాల్లో సాధారణంగానే ఉన్నా, ఈ ఆకృతి లోపాలే సంతానలేమికి ప్రధాన కారణమవుతున్నాయని స్పష్టం చేశారు.
డీఎన్ఏ పై ప్రభావం..
సిగరెట్ పొగలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి చేరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతాయని, ఇది నేరుగా వీర్య కణాల డీఎన్ఏపై ప్రభావం చూపుతుందని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్లు వెల్లడించారు. ఈ విష రసాయనాల వల్ల పురుషుల జననేంద్రియ వ్యవస్థలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, వీర్య కణాల ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది.
చాలా మంది పురుషులు తమకు ఎటువంటి అనారోగ్యం లేదని భావిస్తారు కానీ.. ఈ చిన్న అలవాటు వారి సంతాన సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. దీనివల్ల ఐవీఎఫ్ వంటి ఖరీదైన చికిత్సలు కూడా విఫలమయ్యే చాన్స్ ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగతాగుడు మాన్పిస్తేనే..
సంతానలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలం చికిత్స తీసుకోవడమే కాకుండా, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఐవీఎఫ్ వంటి చికిత్సలకు వెళ్లే పురుషులు ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.
ఆస్పత్రుల్లో సంతానలేమికి చికిత్స అందించే సమయంలోనే, పొగతాగే అలవాటు ఉన్నవారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి, వారు ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని ఈ నివేదికలో స్పష్టం చేశారు. తండ్రి కావాలనుకునే ప్రతి పురుషుడు తన ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు స్వస్తి పలకడమే సంతాన ప్రాప్తికి మొదటి మెట్టు అని పరిశోధకులు తేల్చి చెప్పారు.
