సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దివంగత నటుడు, నటభూషణ్ శోభన్ బాబు భార్య శాంతకుమారి గురువారం (జులై 9, 2026) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే శోభన్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాంతకుమారి గురువారం సాయంత్రం తన ఆప్తమిత్రురాలితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ శుక్రవారం చెన్నైలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
శోభన్ బాబు, శాంతకుమారిల వివాహం 1958లో జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2008లో గుండెపోటుతో శోభన్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే.
సినీ రంగంలో శోభన్ బాబు స్టార్ హీరోగా వెలుగొందినప్పటికీ, శాంతకుమారి ఎప్పుడూ ప్రమోషన్స్ కు దూరంగా, నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ, శోభన్ బాబు సినీ ప్రయాణానికి తెరవెనుక బలమైన అండగా నిలిచారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు.
