పెయింటింగ్ వేయాలంటే పెయింట్ ఉండాల్సిన అవసరంలేదు, పెరుగుతో కూడా వేయొచ్చని ప్రూవ్ చేస్తున్నారు. చైనాలోని జెన్ – జెడ్ యూత్. వాళ్ల క్రియేటివిటీని చూపించేందుకు పెరుగును పెయింట్‌లా వాడేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనాలో గత కొన్నేళ్లుగా పెరుగు వాడకం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం హెల్దీ ఫుడ్‌గా యోగర్ట్ తీసుకునేవాళ్లు. ఇప్పుడు అది లైఫ్ స్టైల్లో భాగమైంది. కొత్త రుచులు, అట్రాక్టివ్ ప్యాకేజింగ్, ప్రెజెంటేషన్ కారణంగా యోగర్ట్ ప్రొడక్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాన్బా అంటే గట్టి పెరుగుతో వేసే పెయింటింగ్. మామూలు పెరుగులోని నీటిని వడకట్టి తీసేయడం వల్ల ఇది దాదాపు పేస్ట్‌లా లేదా క్రీమ్ చీజ్‌ను పోలి ఉంటుంది. దాన్ని కాన్వాస్‌లపై, గోడలపై, చెక్క పలకలపై పూసి వివిధ ఆకృతులు రూపొందిస్తున్నారు. దీని పేస్ట్‌లాంటి గుణం కారణంగా అది పెయింట్‌లా కనిపించడం ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీనికి మరో కారణం “యోగర్ట్ బౌల్” కల్చర్.సాధారణ పెరుగును వడగట్టి మరింత చిక్కగా తయారుచేసే పద్ధతి చైనాలో ఈ మధ్య బాగా పాపులర్ అయింది.
చైనాలో ‘యోగర్ట్ బౌల్స్’, ‘యోగర్ట్ కేకులు’, ‘డ్రై యోగర్ట్’ వంటివి హెల్దీ ఫుడ్‌గా ఫేమస్ అయ్యాయి. కొందరు దీనిని “సిమెంట్ యోగర్ట్” అని కూడా పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుడ్ కంటెంట్, డీఐవై వీడియోలు, ఇంటీరియర్ డెకరేషన్ పోస్టులలో యోగర్ట్‌ను ఇలా కొత్తగా చూపించడంతో వీడియోలు వైరల్‌గా మారి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలూ ఉన్నాయి.
పెరుగు తినే పదార్థం కాబట్టి దాన్ని ఇలా ఉపయోగించడం వృథా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు కొద్ది రోజుల తర్వాత అది పాడైపోయే అవకాశం ఉందని, దుర్వాసన వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అయినప్పటికీ, ఈ ట్రెండ్ వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. గతంలో కాఫీ, పాలు, ఐస్‌క్రీమ్, టీ వంటి ప్రొడక్ట్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్‌లుగా మారాయి. ఇప్పుడు అదే జాబితాలో యోగర్ట్ చేరింది. నిన్నటి వరకు అల్పాహారంలో కనిపించిన యోగర్ట్, నేడు కళా ప్రపంచంలో తనకంటూ ఒక కొత్త గుర్తింపును సంపాదించుకుంటోంది. జెన్-– జెడ్ తరానికి ఇది మరో వైరల్ ప్రయోగం మాత్రమే కావచ్చు. కానీ ఆ ప్రయోగం ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మాత్రం సక్సెస్ అయింది.
