- కుమ్రం భీం జిల్లా బూరుగూడలో ఘటన
మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎలుక శ్రీవాణి (25) అనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఆదివారం రాత్రి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన వెంకటేశ్, సువర్ణ దంపతుల పెద్ద కూతురైన శ్రీవాణి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.
బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ఇటీవలే ఆమె తన అమ్మమ్మ ఊరైన బూరుగూడకు వచ్చింది. ఆదివారం రాత్రి మహిళలతో కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయింది. స్థానికులు వెంటనే శ్రీవాణిని ఆసిఫాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే, అక్కడే ఉన్న భారీ డీజే సౌండ్ కారణంగానే యువతి గుండెపోటుకు గురై మృతి చెంది ఉండవచ్చని పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
