
బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్ సోహైల్(Sohail) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు(Bootcut Balaraju). ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోహైల్ నటించడమే కాక నిర్మాతగానూ వ్యవహరించిన ఈ సినిమాలో.. మేఘలేఖ హీరోయిన్గా నటించారు. సునీల్, ఇంద్రజ, ముక్కు అవినాష్ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాను.. శ్రీనివాస్ కోనేటి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో హీరో సోహైల్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. తన సినిమాను చూడమంటూ మీడియా ముఖంగా బ్రతిమిలాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో సోహైల్ మాట్లాడుతూ.. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. రూ.5 కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాకు నో షో బోర్డులు పెట్టడమేంటన్నా? జనాలు లేరని షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక్కో థియేటర్ కు కనీసం 30 మందైనా వెళ్లండన్నా. ఫ్యామిలీతో చూసే సినిమాలు తీయమంటారు కదా ఇప్పుడేమైందన్నా? నేను తీస్తే ఆదరించడం లేదు ఎందుకు? మా దగ్గర ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఉన్నంతలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేయగలిగాము. దయచేసి నా సినిమాకు వెళ్లండన్నా.. అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు సోహైల్.
ఇది చూసిన ఆడియన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ గుర్తింపుతో సినిమాల్లో రాణించడం కష్టం. నీ సినిమాలో దమ్ముంటే జనాలు వాళ్ళే వస్తారు. ఎలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవసరంలేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సోహైల్ చేసిన ఈ రిక్వెస్ట్ తో జనాలు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది చూడాలి మరి.