వెలుగు, నెట్వర్క్: విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ బుధవారం తెలంగాణ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం, ములుగు, మెదక్, వరంగల్ జిల్లాలతో పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరవీరుల స్తూపాల వద్ద బొకేలు సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రజల భద్రత కోసం వారి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలను సత్కరించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో అమరవీరుడు భూక్య భీమ్‌సింగ్ జ్ఞాపకార్థం ఆయన కొడుకు భూక్య రాజేశ్, కోడలు రోజీ క్రిస్టియాన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
