ఫోన్ లో వీడియోలు చూడొద్దని తండ్రి మందలించినందుకు ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగింది. తండ్రి తిట్టిండని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు.
పోలీసు వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సయ్యద్ నగర్ లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) దగ్గరలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చని పోయింది. తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. తండ్రి చెప్పినా వినకుండా అఫాన్ ఖాన్ ఫోన్లో వీడియోగేమ్ చూస్తూ స్కూల్ కు డుమ్మా కొడుతున్నాడు. ఇప్పటికే మూడు స్కూల్స్ మారాడు. స్కూల్ కు సరిగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్ ఖాన్ తన గదిలో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
