టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'సన్ ఆఫ్ కనకదుర్గమ్మ'. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ముఖ్యంగా అమ్మవారి పాత్రలో లయ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఈ మూవీ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో లయ అమ్మవారి రూపంలో శక్తిమంతంగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ పాత్రలకు భిన్నంగా, దైవిక శక్తి, ఉత్కంఠ, యాక్షన్ మేళవింపుతో ఆమె పాత్ర ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా ప్రధానంగా నిధి అన్వేషణ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని చిత్రబృందం వెల్లడించింది. నిధి కోసం సాగే అన్వేషణలో ఎలాంటి మలుపులు ఎదురవుతాయి? కనకదుర్గమ్మకు, కథలోని రహస్యాలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కథ, కథనం, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాగా మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వం వహిస్తుండగా, కాకర్ల గోవర్ధనరావు కథను అందిస్తున్నారు. సాంకేతికంగానూ ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు. శశిధర్ లంక సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కే ప్రసన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. మొత్తానికి, దైవిక నేపథ్యం, నిధి అన్వేషణ, ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో 'సన్ ఆఫ్ కనకదుర్గమ్మ' ఎలాంటి అనుభూతిని అందించనుందో చూడాలి.
