ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలోకి సోనియా.. తొలి పోస్టుగా ఆత్మకథ..

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలోకి సోనియా.. తొలి పోస్టుగా ఆత్మకథ..
  • ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫస్ట్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ చేసిన అగ్రనేత
  • ఇందిర, రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హత్యల నుంచి రాజకీయ ప్రస్థానం వరకు..
  • వచ్చే నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పుస్తకం
  • ప్రేమ, కర్తవ్యం, విషాదాలతో 544 పేజీల జీవన యానం
  • పెంగ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ వెనక్కి.. హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతికి ప్రచురణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. తన జీవిత విశేషాలతో రూపొందించిన ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌’ ఫస్ట్​లుక్​ను తొలి పోస్టుగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌‌‌‌‌‌‌‌ 10న ఈ పుస్తకం విడుదల కానుంది. తన జీవితంలో జరిగిన అనేక అంశాలతోపాటు  ప్రేమ, కర్తవ్యం, విషాదాలు, మలుపులను ఈ పుస్తకంలో వివరించినట్లు సోనియా వెల్లడించారు. తన ఆత్మకథను పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆమెకు పుస్తకాన్ని అందించిన ప్రచురణకర్తలను ఉద్దేశించి.. ‘‘మీరు చాలా బరువైన బాధ్యతను మోసుకొచ్చారు’’ అని నవ్వుతూ చమత్కరించారు. అనంతరం 544 పేజీల పుస్తకాన్ని పట్టుకొని ఫొటోలు దిగారు. పేజీలను ఆసక్తిగా తిరగేస్తూ అందులోని అరుదైన ఫొటోలను కుమార్తె ప్రియాంక గాంధీకి చూపించారు. ఈ సందర్భంగా సోనియాకు ప్రియాంక స్వీట్లు తినిపించి ఆలింగనం చేసుకున్నారు.

తొలి పోస్ట్​ ఇదే.. 
‘‘అందరికీ నమస్కారం. ‘బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌: ఏ జర్నీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌’ ఫస్ట్​ లుక్​ను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమ, బాధ్యత, నష్టం, మనకు చెందిన స్థానం కోసం అన్వేషణ.. ఈ అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ పుస్తకాన్ని మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నా’’ అని ఇన్​స్టా పోస్టులో పేర్కొన్నారు.  

ఇందిరా, రాజీవ్‌‌‌‌‌‌‌‌ హత్యల నుంచి..
తన కుటుంబం గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు రాశారని, కానీ భావాలను పూర్తిగా ఆవిష్కరించలేకపోయాయని సోనియా గాంధీ గతంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం తన కుటుంబ సభ్యుల్లోని మానవీయ కోణాన్ని తెలియజేస్తుందన్నారు. ఆరు దశాబ్దాలుగా తాను చూసిన సామాజిక, రాజకీయ మార్పులపై అనుభవాలను కూడా ఇందులో వివరించినట్లు వెల్లడించారు.

1984లో తన అత్తగారైన ఇందిరా గాంధీ హత్య తర్వాత సోనియా జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అనంతరం రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఏడేండ్ల తర్వాత 1991లో రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ కూడా హత్యకు గురయ్యారు. ఈ విషాదాల తర్వాత సోనియా గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్న పార్టీ ప్రతిపాదనను సైతం తిరస్కరించారు.

ప్రచురణ సంస్థల్లో మార్పులు..
తొలుత ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకొచ్చిన పెంగ్విన్‌‌‌‌‌‌‌‌ ర్యాండమ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ఇండియా తర్వాత వెనక్కి తగ్గింది. మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లో సంపాదకీయ మార్పులు చేయాలన్న ప్రతిపాదనలను సోనియా గాంధీ తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం హార్పర్‌‌‌‌‌‌‌‌ కాలిన్స్‌‌‌‌‌‌‌‌ ఈ పుస్తక ప్రచురణ బాధ్యతలు చేపట్టింది.