కన్నులొట్టబోయి చావు తప్పడమనే సామెత సౌతాఫ్రికాకు సరిగ్గా సరిపోతుంది. లేదంటే సౌతాఫ్రికా వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించేది కాదు. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే వాన వల్ల రద్దవడం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దవడంతో వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా 8వ స్థానాన్ని దక్కించుకుంది.
వాన వల్ల...
ఐర్లాండ్ బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అయితే ఈ సిరీస్‌ను 3-0తో ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేస్తే.. ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ లో 8వ స్థానంలో నిలిచేది. కానీ తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఐర్లాండ్‌కు ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో వరల్డ్ కప్‌లో తలపడే జట్లు ఫైనల్ జాబితాలో సౌతాఫ్రికాకు స్థానం దక్కింది. దీంతో ఐర్లాండ్ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడటం కుదరదు.
సూపర్ ఫాంలో సౌతాఫ్రికా..
2022లో సౌతాఫ్రికా సూపర్ ఫామ్ లో ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. ఆ తర్వాత నెదర్లాండ్‌పై వన్డే సిరీస్ ను 2-0తో గెలిచింది. అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితాలతో వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఐర్లాండ్.. బంగ్లాదేశ్ పై 3–0తో సిరీస్ ను దక్కించుకుంటే మాత్రం సౌతాఫ్రికా వన్డే వరల్డ్ కప్ జాబితాలో 8వ స్థానాన్ని మిస్ చేసుకునేది. అలాగే న్యూజిల్యాండ్ చేతిలో శ్రీలంక 2-0 తేడాతో ఓడిపోవడం కూడా ప్రోటీస్ టీమ్ కు కలిసొచ్చింది.
నేరుగా అర్హత...
వన్డే వరల్డ్ కప్ 2023కు ఆతిథ్యం ఇస్తుండటంతో టీమిండియా నేరుగా అర్హత సాధించింది. ఇప్పుడు సౌతాఫ్రికా కూడా ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయింది. భారత్, సౌతాఫ్రికా కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీకు నేరుగా అర్హత సాధించాయి. వీటితో పాటు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ జట్లు మాత్రం జూన్ నెలలో జరిగే క్వాలిఫైయర్స్ ఆడాల్సి ఉంటుంది.