సెంచరీలతో దుమ్మురేపిన ప్రిటోరియస్, బోష్‌‌.. జింబాబ్వేపై ఫస్ట్ ఇన్సింగ్స్‎లో సౌతాఫ్రికా భారీ స్కోర్

సెంచరీలతో దుమ్మురేపిన ప్రిటోరియస్, బోష్‌‌.. జింబాబ్వేపై ఫస్ట్ ఇన్సింగ్స్‎లో సౌతాఫ్రికా భారీ స్కోర్

బులవాయో: జింబాబ్వేతో శనివారం మొదలైన తొలి టెస్ట్‌‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. లువాన్-డ్రే ప్రిటోరియస్ (153), కార్బిన్‌‌ బోష్‌‌ (100 బ్యాటింగ్‌‌) సెంచరీలతో దుమ్మురేపడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌కు సౌతాఫ్రికా 90 ఓవర్లలో 418/9 స్కోరు చేసింది. బోష్‌‌తో పాటు ఎంపాక (9 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన సఫారీ ఇన్నింగ్స్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ విఫలమైంది. టోనీ డి జోర్జి (0), బ్రీట్జ్‌‌కే (13), వియాన్‌‌ ముల్డర్‌‌ (17), బెడింగ్‌‌హామ్‌‌ (0) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 

దీంతో 55/4తో కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను ప్రిటోరియస్‌‌, డేవ్లాడ్ బ్రేవిస్‌‌ (51) ఐదో వికెట్‌‌కు 95 రన్స్‌‌ జోడించి ఆదుకున్నారు. వరుస విరామాల్లో బ్రేవిస్‌‌, వెరియానే (1) ఔటైనా, కార్బిన్‌‌ బోష్‌‌ కీలక ఇన్నింగ్స్‌‌ ఆడాడు. ప్రిటోరియస్‌‌తో ఏడో వికెట్‌‌కు 108, కేశవ్‌‌ మహారాజ్‌‌ (21)తో ఎనిమిదో వికెట్‌‌కు 41, కొడి యూసుఫ్‌‌ (27)తో తొమ్మిదో వికెట్‌‌కు 59 రన్స్‌‌ జత చేశాడు. తనక చివాంగ 4, ముజరబానీ 2, మసకద్జా, మసకేసా చెరో వికెట్‌‌ తీశారు.