OTT Movies Releases: మారుతున్న ఓటీటీ లెక్కలు.. నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం!

OTT Movies Releases: మారుతున్న ఓటీటీ లెక్కలు.. నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం!

థియేటర్లలో సినిమా చూస్తుంటే  ఆ అనుభూతే వేరు. ఈ వందలాదిమంది ప్రేక్షకుల మధ్య   ఈలల, కేరింతలతో ఉత్సాహంగా ఉంటుంది.  ఒక కొత్త జోష్ వస్తుంది.  కానీ, గత కొన్నేళ్లుగా ఓటీటీల రాకతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.  దీంతో బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు భారీ నష్టాన్ని  మూటగట్టుకుంటున్నాయి.  ఈ సంక్షోభం నుండి థియేటర్ వ్యవస్థను రక్షించుకోవడానికి దక్షిణాది ఎగ్జిబిటర్లు ఒక కీలక నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

ఎందుకీ కఠిన నిర్ణయం?

ఇకపై ఏ సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన 8 వారాల (రెండు నెలల) తర్వాతే ఓటీటీలోకి రావాలనే నిబంధనను తీసుకురావాలని వారు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలైనా, చిన్న చిత్రాలైనా  కేవలం 4 వారాల విండోనే ఎంచుకుంటున్నాయి. అంటే సినిమా విడుదలైన నెల రోజులకే ఇంట్లోని టీవీల్లోనో, స్మార్ట్‌ఫోన్లలోనో ప్రత్యక్షమవుతున్నాయి.  దీనివల్ల చిత్ర పరిశ్రమ నష్టాల్లోకి జారుకుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

థియేటర్లకు తగ్గుతున్న ప్రేక్షకులు..

ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది కదా, అప్పుడే చూద్దాం అనే ధోరణి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. దీనివల్ల థియేటర్ల వద్ద సందడి తగ్గుతోంది. మరి ముఖ్యంగా చిన్ని సినిమాలకు ఓటీటీ శాపంగా మారింది.  బడ్జెట్ తక్కువ ఉన్న సినిమాలకు థియేటర్లలో నిలదొక్కుకోవడానికి సమయం కావాలి. కానీ నెల రోజుల్లోనే ఓటీటీ వార్త రావడంతో, బాగున్న సినిమాలు కూడా రెండో వారం నుండే డీలా పడుతున్నాయి. ఒకప్పుడు నచ్చిన సినిమాను థియేటర్లో రెండు, మూడు సార్లు చూసేవారు. ఇప్పుడు ఓటీటీ సౌలభ్యం వల్ల ఆ 'రిపీట్ ఆడియన్స్' సంఖ్య దాదాపు శూన్యమైపోయిందన్న ఆవేదన సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

►ALSO READ | Vadhala : జగపతి బాబు - లయ జోడీ గా సస్పెన్స్ థ్రిల్లర్.. 'వదలా' గ్లింప్స్ రిలీజ్!

నిర్మాతల స్పందన ఎలా ఉండబోతోంది?

ఎగ్జిబిటర్ల వాదనలో లాజిక్ ఉన్నప్పటికీ, నిర్మాతలు దీనిని ఎలా స్వీకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓటీటీ విండో పెంచితే డిజిటల్ రైట్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అయితే, థియేటర్ల ద్వారా వచ్చే రెవెన్యూ పెరిగితే ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.. థియేటర్లలో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, లాంగ్ విండో (8 వారాలు) ఉంటేనే ప్రేక్షకుడు పెట్టిన ఖర్చుకు విలువ దక్కుతుంది

థియేటర్ అనుభవాన్ని ఓటీటీ భర్తీ చేయలేదని, కానీ ఆ గ్యాప్ ఎక్కువగా ఉంటేనే జనం థియేటర్లకు క్యూ కడతారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, థియేట్రికల్ రెవెన్యూనే సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈ 8 వారాల నిబంధనతో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాలి..