శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 9, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? అసలు ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథేంటి? శ్రీవిష్ణు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారా? ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరో హిట్ పడిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలు, ఆడియన్స్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం..
కథేంటంటే?
1992లో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే కథ ఇది. మాడుగుల అనే ప్రాంతంలో సినిమా థియేటర్ నడిపే కళ్యాణ్ (శ్రీవిష్ణు) బాలకృష్ణకు వీరాభిమాని అయిన తన తల్లి సరస్వతమ్మ (రాధిక శరత్‌కుమార్)తో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడిన సితార (మహిమా నంబియార్)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె కుటుంబంపై ఉన్న రూ.5 లక్షల అప్పు వీరి పెళ్లికి అడ్డంకిగా మారుతుంది. ఆ అప్పు తీర్చేందుకు ప్రభుత్వ నగదు బహుమతి కోసం నక్సలైట్‌గా నటించి లొంగిపోవాలని కళ్యాణ్ ప్లాన్ చేస్తాడు. కానీ నిజమైన నక్సలైట్ల మధ్యకు వెళ్లడంతో అతడి పథకం బెడిసికొడుతుంది. పోలీసుల వేట, అడవిలో ఎదురయ్యే ప్రమాదాల మధ్య కళ్యాణ్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? ఈ కథలో జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో), బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) పాత్రలేంటి? అన్నది తెరపై చూడాలి.
ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
సోషల్ మీడియాలో వస్తున్న ఫస్ట్ టాక్ గమనిస్తే.. సినిమాలోని కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు, సత్య, సుదర్శన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హీరో హీరోయిన్‌ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు, లవ్ లెటర్ ఎపిసోడ్‌కు మంచి స్పందన లభించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా శ్రీ విష్ణు, సత్య, సుదర్శన్, కామెడీ ట్రాక్, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, బాలకృష్ణ అభిమానిగా రాధిక శరత్‌కుమార్ చేసే సందడి, ఆమె కోసం హీరో పోలీసు స్టేషన్ చుట్టూ తిరగడం ఇవన్నీ సరదాగా సాగిపోతాయి. అయితే, కామ్రేడ్ కళ్యాణ్ టైటిల్ తగ్గట్టుగా నక్సలిజం నేపథ్యాన్ని వినోదంతో ముడిపెట్టిన విధానం, కథలోని భావోద్వేగాల విషయంలో మిక్సెడ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో అందరి రివ్యూలు ఒకేలా లేవు. కథనం మరింత బలంగా ఉండాల్సిందనే టాక్ వినిపిస్తోంది.
శ్రీవిష్ణుకు మరో హిట్ పడినట్టేనా?
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసే శ్రీవిష్ణు.. ఈసారి 90ల కాలం నాటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’లో కూడా శ్రీవిష్ణు తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో ఆయన టైమింగ్ మరోసారి నవ్వులు పూయించిందనే టాక్ వినిపిస్తోంది. సత్యతో కలిసి చేసే సీన్లలో ఇద్దరి కామెడీ బాగా వర్కౌట్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల కథలోని సీరియస్‌నెస్ తగ్గిపోవడం, భావోద్వేగాలు బలంగా పండకపోవడం సినిమాకు మైనస్‌గా మారాయని అంటున్నారు. మొత్తంగా శ్రీవిష్ణు తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది
మొత్తంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’లో కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని కొందరు ప్రేక్షకులు చెబుతుండగా, కథనం విషయంలో మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మిక్సెడ్ టాక్ ను దాటుకుని సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
