CSK vs SRH: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోట అయిన చెపాక్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్యాట్ కమిన్స్ సేన ప్లేఆఫ్స్ బెర్త్‌ను మరింత సుస్థిరం చేసుకోగా.. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇషాన్ కిషన్ 'మాస్టర్ క్లాస్':
181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ (6)ను ముకేష్ చౌదరి త్వరగానే అవుట్ చేశాడు. కానీ, ఆ తర్వాత ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి సూపర్బ్ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక మిడిల్ ఓవర్లలో ఇషాన్‌కు తోడైన హెన్రిచ్ క్లాసెన్ కూడా 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 3 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న క్లాసెన్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు.
ఉత్కంఠభరిత ఛేదన:
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (26) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, జట్టు స్కోరు 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ముకేష్ చౌదరి బౌలింగ్‌లో ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా వికెట్లు పడుతున్నా ఒక ఎండ్‌లో పట్టుదలతో ఆడిన ఇషాన్ కిషన్.. చివర్లో బౌండరీలు బాదడంతో హైదరాబాద్ మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
