సర్వరోగ నివారిణి సబ్జా

సర్వరోగ నివారిణి సబ్జా

ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే..చాలామంది సబ్జా గింజలను నానబెట్టి,వాటిలో చక్కెర వేసుకుని తాగేవాళ్లు. ఇప్పుడు ఆ విషయాన్నే మరిచాం. బజార్లో తక్కువ ధరకే ఇవి దొరుకుతాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి శరీరానికి మేలు చేస్తాయి.చూసేందుకు చిన్నగా, నలుపు రంగులోఉంటాయి. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో వీటి వాడకం ఎక్కువ. ఈ గింజల్లోపీచుతో పాటు అనేక పోషకాలున్నాయి.

బరువును తగ్గిస్తాయి….

బాబిలీ విత్తనాలు అని పిలి చే ఈ గింజలు బరువును నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు క్రమం తప్పకుండా సబ్జా జ్యూస్ తీసుకోవాలి. బరువు తగ్గించడంతోపాటు రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. నీళ్లలో సబ్జా గింజలు నానపెడితే 30 రెట్లు పెరిగి ఉబ్బుతాయి. ఈ గింజలు ఆకలి తగ్గించి,బరువును అదుపులోకి తెస్తాయి.

చర్మ సమస్యలకు..

చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. సబ్జా చర్మానికి మంచి నిగారింపు ఇస్తుంది. చర్మ సంబంధిత సమస్యలనూ తగ్గిస్తుంది. తామర, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.

మలబద్ధకం చెక్…

సబ్జా గింజలు కడుపును శుభ్రపరుస్తాయి.ఈ గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. శరీరంలోని వ్యర్థాలు బయటికిపోతాయి. దాంతో రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు… కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తిని కూడా తగ్గిస్తుంది. సబ్జా గింజల్లో విటమిన్–‘కె’, ప్రొటీన్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. క్రమంతప్పకుండా సబ్జా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ‘విటమిన్–ఏ, కె, బీటా-కెరోటిన్, పొటాషియం, రాగి, క్యాల్ షియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి పోషకాలు అధికం.

ఒత్తిడి మాయం…

ప్రతిఒక్కరి జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం. ఈ సబ్జా గింజలు ఒత్తిడిని దూరం చేస్తాయి. మానసిక, మైగ్రేన్‌, ఒత్తిడి లక్షణాలను దూరం చేస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. సబ్జా గింజలు రక్త శుద్ధికి బాగా పనిచేస్తాయి. వాంతులు, వికారం తగ్గుతాయి. నొప్పి ,వాపు లక్షణాలను నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, కొలెస్ర్టాల్ , దగ్గు, శ్వాసకోశ, ఎక్కిళ్లు, నోటిపూత, చెడు వాసన లాంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

కొన్ని జాగ్రత్తలు…

సబ్జా గింజలను పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉంచాలి. ఈ గింజలు ఈస్ట్రో జన్ స్థాయిని తగ్గిస్తాయి. గర్భిణులకు ఇవ్వొద్దు.