చిన్నవయసులోనే తండ్రి దూరమయ్యాడు. అమ్మకు కుటుంబ భారాన్ని తగ్గించేందుకు పసి వయసులోనే పనులు చేయడం మొదలుపెట్టింది పబిబెన్. యుక్త వయసుకు వచ్చేలోపు సంప్రదాయ రబారి ఎంబ్రాయిడరీ ఆర్ట్ నేర్చుకుంది. తక్కువ టైంలోనే అందులో ఆరితేరింది. ఎన్నో ప్రయోగాలు చేసి, కొత్త టెక్నిక్స్ కనిపెట్టింది. అందుకే ఆ కళే ఆమెకు ఆసరానిచ్చింది. తనను ప్రపంచానికి పరిచయం చేసింది.
గుజరాత్‌లోని కచ్ ప్రాంతం తరతరాలుగా వస్తున్న కొన్ని అద్భుతమైన కళలు, చేతివృత్తులకు నిలయంగా ఉంది. స్థానికంగా ఉండే రబారి తెగకు చెందిన పబిబెన్ రబారి వాటిలో ఒక కళను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె కచ్ జిల్లా భద్రోయి గ్రామంలో పుట్టింది. ఐదేండ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఆమెకు ఇద్దరు చెళ్లెళ్లు. ముగ్గురు పిల్లల్ని పోషించడానికి వాళ్ల అమ్మ రోజూ కూలీ పనులు చేసేది. దాంతో పబిబెన్ కూడా నాలుగో తరగతిలో చదువు మానేసి తల్లికి సాయంగా చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది. రూ.1 కోసం ఇంటింటికీ నీళ్లు మోసేది.
- నానమ్మ నేర్పిన కళ
‘ధేబరియా రబారి’ వర్గంలో అమ్మాయిలు కచ్చితంగా సంప్రదాయ ఎంబ్రాయిడరీ ఆర్ట్ రబారిని నేర్చుకోవాలనే నియమం ఉండేది. పెండ్లి కూతుళ్లు ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలను కట్నంగా ఇవ్వడం అక్కడి ఆనవాయితీ. అందుకే చాలామంది అమ్మాయిలు ఆ కళలో నైపుణ్యం సాధించేంతవరకు పెండ్లి చేసుకునేవాళ్లు కాదు. కానీ.. అందుకు చాలా టైం పట్టేది. దానివల్ల పెండ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయని గ్రామ పెద్దలు భావించారు. 1990ల్లో ఆ ఆనవాయితీని రద్దు చేశారు. వ్యక్తిగత ఉపయోగం కోసం ఎంబ్రాయిడరీ చేయడాన్ని నిషేధించారు. దాంతో ఆ ఆర్ట్ నేర్చుకునేవాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే.. పబిబెన్ తన నానమ్మ దగ్గర అప్పటికే రబారి నేర్చుకుంది. 1998లో భుజ్‌లోని కళా రక్షా ఎన్జీవోలో చేరింది. అందులో ఆ ఆర్ట్ వర్క్ చేస్తూ రోజుకు రూ.50 సంపాదించేది. అలా పెండ్లి కోసం నేర్చుకున్న కళ బతుకుదెరువుకు ఉపయోగపడింది.
- కొత్త టెక్నిక్
పబిబెన్ కొన్నేండ్లకు రబారి ఆర్ట్‌లో ఆరితేరింది. ఆ తర్వాత వాళ్ల తెగ నియమాలను ఉల్లంఘించకుండా డెకరేటివ్ ఎంబ్రాయిడరీని క్రియేట్ చేసింది. మెషిన్‌తో రెడీమేడ్ ట్రిమ్స్, రిబ్బన్లు, ప్యాటర్న్స్‌ని క్లాత్‌పై అప్లై చేసే కొత్త టెక్నిక్‌ని కనిపెట్టింది. దానికి “హరి జరి” అని పేరు పెట్టింది. పబిజరి అని కూడా పిలుస్తుంటారు. మొదటగా వైబ్రెంట్ కలర్స్‌తో అద్భుతమైన డిజైన్లలో షాపింగ్ బ్యాగ్ తయారుచేసింది. ఆమె వర్క్‌కు చాలా గుర్తింపు వచ్చింది. దాంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా 2015లో ‘పబిబెన్.కామ్’ పేరుతో ఈ కామర్స్ వెబ్‌సైట్ మొదలుపెట్టింది. దేశంలోనే మొదటి విమెన్ ఆర్టిజన్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది ఒకటి.
- సూపర్ హిట్
పబిబెన్ అమ్మే బ్యాగులకు కొన్నేండ్లలోనే గిరాకీ పెరిగింది. మామూలు వ్యక్తులే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు ఆమె దగ్గరనుంచి బ్యాగ్స్ కొన్నారు. అంతెందుకు ఆమె తయారుచేసిన బ్యాగ్స్ బాలీవుడ్ సినిమా ‘లక్ బై చాన్స్’, హాలీవుడ్ సినిమా ‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’లో కనిపించాయి. ప్రస్తుతం ఆమె బ్యాగ్‌లతోపాటు రకరకాల పర్సులు, దుర్రీలు, ఫైల్స్, క్విల్ట్‌లు, కుషన్ కవర్లు అమ్ముతోంది. “విద్య లేకపోతే విజయం రాదనేది అవాస్తవం. ఓర్పు, కష్టపడే సామర్థ్యం ఉండాలి. అవే మీకు కొండంత బలం ఇస్తాయి” అంటోంది పబిబెన్.
- తోటి ఆడవాళ్లకు ఉపాధి
పబిబెన్ తను సంపాదిస్తూనే తోటి ఆడవాళ్లకూ చేయూతనిస్తోంది. ఇప్పటివరకు వాళ్ల ఊళ్లోని 300 మందికి పైగా మహిళలకు ఉపాధిని కల్పించింది. వాళ్లే అల్లికలు, కుట్టుపని చేస్తున్నారు. భర్త లక్ష్మణ్ రబారి కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఆమె 2016లో గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ఐఎంసీ లేడీస్ వింగ్ జానకీ దేవి బజాజ్ పురస్కారం అందుకుంది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొని తన కథను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం కూడా దక్కింది.
