‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘ప్రసన్న వదనం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్, ఇటీవలే ‘హే బలవంత్’ (Hey Balwanth) అనే మూవీతో ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి 20న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిల్లో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ క్రమంలోనే మూవీ ఓటీటీ ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమైంది.
‘హే బలవంత్’ ఓటీటీ:
గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా, ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) లో స్ట్రీమ్ అవుతుంది. ఇవాళ్టి (మార్చి 31, 2026) నుండి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. సుహాస్ మార్క్ కామెడీ, తండ్రీకొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ ఓటీటీ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
The business begins!#HeyBalwanth
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 30, 2026
STREAMING NOW #TeluguZee5 #Suhas #HeyBalwanthOnZee5 pic.twitter.com/34BOOlrBJR
కథేంటంటే:
ఇదొక వినూత్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సుహాస్ తండ్రిగా రావు బలవంత్ పాత్రలో (సీనియర్ నటుడు నరేష్) నటించారు.. ఆయన దశాబ్దాలుగా తన కుటుంబ వ్యాపారాన్ని (Family Business) చాలా రహస్యంగా నడుపుతుంటారు.
అది ఎంత రహస్యం అంటే.. సొంత కుటుంబ సభ్యులకు కూడా ఆ వ్యాపారం ఏంటనేది తెలియదు. అయితే, తండ్రి తర్వాత ఆ వ్యాపార బాధ్యతలను కృష్ణ బలవంత్ (సుహాస్) చేపట్టాలని నిర్ణయించుకుంటాడు.
ఈ క్రమంలోనే ఆ వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యం కృష్ణ బలవంత్ తెలుసుకుని షాక్ అవుతాడు. కృష్ణ తండ్రి చేసే బిజినెస్‌ను చూసి, ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగారం) అసహ్యించుకొని వెళ్లాల్సి వస్తుంది.
ఇంతకీ రావు బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏమిటి? మిత్ర తాత (బాబు మోహన్)కి ఈ బిజినెస్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అసలు చంప (స్రవంతి) ఎవరు? ఈ బిజినెస్ వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగతా కథ.
పాజిటివ్ అంశాలు:
ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని నగరం కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు నరేష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. వెన్నెల కిశోర్ తనదైన శైలిలో నవ్వులు పూయించగా, అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించారు. తొలుత ఈ సినిమాకు ‘హే భగవాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా మేకర్స్ దానిని ‘హే బలవంత్’గా మార్చాల్సి వచ్చింది.
సాధారణంగా సుహాస్ సినిమాలు అంటేనే ఒక సహజత్వం ఉంటుంది. ‘హే బలవంత్’లో కూడా నేటి తరం యువతకు, తండ్రులకు మధ్య ఉండే జనరేషన్ గ్యాప్ , బాధ్యతలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా క్లీన్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం, వీకెండ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు మార్చి 31న జీ5 లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
