మాస్ అవతారంలో సుహాస్.. 'మండాడి' బర్త్‌డే పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు!

మాస్ అవతారంలో సుహాస్.. 'మండాడి' బర్త్‌డే పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మండాడి' . ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వెట్రిమారన్ వ్యవహరిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లేటెస్ట్ ఇంటెన్స్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు క్యూట్, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న సుహాస్.. ఈ పోస్టర్‌లో మాత్రం పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. అతడి మేకోవర్, చేతికి ఉన్న ప్రత్యేకమైన ఉంగరం, వాచ్, చుట్టూ కనిపించే వస్తువులు చూస్తుంటే సినిమాలో అతడి పాత్రకు యాక్షన్‌తో బలమైన కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ లుక్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది.

ఇక 'మండాడి'లో యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా సినిమాలోని బోట్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసే రేంజ్‌లో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

సుహాస్ సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కథిర్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ యాక్షన్ కంపోజ్ చేశారు.