ప్రపంచ సినిమా పరిమళం... కాగితంపై కనిపించే సినిమాలు!

ప్రపంచ సినిమా పరిమళం...  కాగితంపై కనిపించే సినిమాలు!

థియేటర్​లో సిల్వర్ స్క్రీన్ మీద సినిమా చూడటం కామన్. అలానే టైమ్ దొరికితే ఇంట్లో తీరికగా కూర్చుని టీవీలో సినిమాలు చూసి ఆనందించేవాళ్లు ఉన్నారు. ఇక కరోనా పుణ్యమా అని ఓటీటీలు విశేషంగా సినిమాలను స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టేశాక, స్మార్ట్ ఫోన్​లోనూ మూవీస్ చూసేయడం అలవాటైపోయింది. అయితే... కాగితం మీద సినిమాను చూసిన అనుభవాన్ని మీరెప్పుడైనా పొందారా? అలాంటి అనుభవాన్ని కలిగించే పుస్తకమే ‘ప్రపంచ సినిమా పరిమళం’. 

ప్రపంచం గ్లోబల్ విలేజ్​గా మారిపోయిన తర్వాత వరల్డ్ సినిమా మన అరచేతిల్లోకి వచ్చేసింది. దాంతో వేల సినిమాలను మన చూపుడు వేలితో స్మార్ట్​ఫోన్‌‌లో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం లభించింది. కానీ, దేనిని చూడాలి? ఎందుకు చూడాలి? చూస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టం! ఏది మంచి సినిమా? ఏది గొప్ప సినిమా? ఏది ఎందుకు మంచి, గొప్ప సినిమా అయ్యింది అని విశ్లేషించే వారు తక్కువైపోయారు. 

థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలను, ఓటీటీలో వచ్చిన వెబ్ సీరిస్​లను సమీక్షించినట్టుగా, పాత సినిమాలకు సంబంధించిన బాగోగులను చెప్పేవారు కరువయ్యారు. ఆ లోటు తీర్చేపనిని తన భుజానికి ఎత్తుకున్నాడు పులగం చిన్నారాయణ. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినిమా మాటల, పాటల రచయిత, నంది అవార్డు గ్రహీత అయిన చిన్నారాయణ ‘ప్రపంచ సినిమా పరిమళం’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆయన సంకలనం చేసిన ఈ పుస్తకంలో మొత్తం 24 సినిమాల విశ్లేషణలున్నాయి. ఆయా చిత్రాల తీరుతెన్నులను రచయిత వివరించిన తీరు చాలా భిన్నంగా ఉంది. ఇవి సమీక్షా వ్యాసాలు కావు. అంతకు మించినవి. సినిమాను ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు అవి గొప్ప సినిమాలు అయ్యాయి? అని తెలిపే పాఠ్యాంశాలు. సింపుల్​గా చెప్పాలంటే కాగితం మీద మనకు 

సినిమాను చూపించేవి!

ప్రముఖ రైటర్ వసుంధర రాసిన ‘ఫ్లఫీ’ సినిమాతో ఈ సంకలనం మొదలైంది. వారు రాసిన వ్యాసం చదవగానే పుస్తకాన్ని పక్కన పెట్టి ‘ఫ్లఫీ’ సినిమాను వెంటనే చూసితీరాలనే కోరిక మనకు బలంగా కలుగుతుంది. అంత గొప్పగా వారు ఈ వ్యాసాన్ని రాశారు. అలానే ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి పరిచయం చేసిన ఇరానియన్ మూవీ ‘టేస్ట్ ఆఫ్ చెర్రీ’ మరో అద్భుతమైన చిత్రం. ప్రముఖ దర్శకులు, నటులు కె. భాగ్యరాజా రాసిన ‘మెర్సీ మిషన్’ సినీ వ్యాసం మరో మాస్టర్ పీస్. జ్యోతి మాసపత్రిక పూర్వ సంపాదకులు వేమూరి సత్యనారాయణ తన జీవితానుభవాలను రంగరించి రాసిన సినీ వ్యాసం ‘డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ది బాల్కాన్స్’ ఈ పుస్తకానికి మరింత వన్నె తెచ్చింది. 

ఇలా చెప్పుకుంటూ పోతే... ఇందులో వ్యాసాలు రాసిన లబ్దప్రతిష్ఠులందరి గురించి వివరించాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం ఎన్నోసార్లు చూసిన బెన్ హర్, ది కిడ్, ది గాడ్ ఫాదర్, ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వంటి సినిమాల గురించి పీఎస్ గోపాలకృష్ణ,  కిరణ్‌‌‌‌ ప్రభ, ప్రభాకర్ జైనీ, పులగం చిన్నారాయణ రాసిన వ్యాసాలను చదివితే ఈ కోణంలో ‘ఈ చిత్రాన్ని చూడలేదే!?’ అనిపిస్తుంది. ఈ సినిమా వెనుక ఇంత గాఢమైన భావం దాగి ఉందా? అని ఆశ్చర్యం కలుగుతుంది. మరోసారి ఆ సినిమాలు చూడాలనిపిస్తుంది. 

‘ప్రపంచ సినిమా పరిమళం’ పుస్తకం గొప్పతనం జి.ఆర్. మహర్షి (ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్), మహమ్మద్ ఖదీర్ బాబు (పర్ఫెక్ట్ డేస్), ఆకెళ్ళ శివప్రసాద్ (ఐ యామ్ క్యూబా), సుబ్బారావు (బ్లడ్ డైమండ్), అన్వర్ (ఎ సీన్ ఎట్ ది సీ), బి.వి.ఎస్.రవి (ఎ షార్ట్ ఫిలిమ్ అబౌట్ కిల్లింగ్), ఎన్. శివనాగేశ్వరరావు (సిన్ నోంబ్రే), పూడూరి రాజిరెడ్డి (సంసార), ఎమ్బీయస్ ప్రసాద్ (ఫియర్ ఈట్స్ ద సోల్), వంగల హర్షవర్థన్ (ఎ మిలియన్ మైల్స్ అవే), పద్మజ సూరపరాజు (క్లోజ్ అప్), భగవంతం (ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్), అన్వర్ మహమ్మద్ (ది నోట్ బుక్), ‘స్రవంతి’ రవికిశోర్ (ది శాండ్‌‌‌‌ పెబుల్స్) తదితరులు ఎంపిక చేసుకున్న సినిమాల్లో ఉంది. వాటిని అద్భుతంగా వారు ప్రెజెంట్ చేయడంతో ఆ గొప్పతనం ద్విగుణీకృతమైంది. 

అలానే స్వర్గీయ రాండర్ గై, వి. మధుసూదనరావు గతంలో పరిచయం చేసిన సినిమాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రముఖ సినీ రచయిత గోపీమోహన్, సాహితీ ప్రియులు మామిడి హరికృష్ణ తమకు నచ్చిన దర్శకుల చిత్రాల జాబితాను అందించారు. ఈ పుస్తకంలోని 24 సినిమాల్లో 13 అమెరికన్ మూవీస్ కాగా మిగిలిన వివిధ దేశాలకు చెందినవి. సినీ, సాహితీ, పాత్రికేయ రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ వ్యాసాలను రాయించడం అంత సులువైన పనేమీ కాదు. అయినా దాన్ని పులగం చిన్నారాయణ సమర్థవంతంగా నిర్వర్తించారు. అంతేకాదు స్వీయ ప్రచురణ సంస్థ అక్షౌహిణి మీడియా ద్వారా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. 

రాబోయే రోజుల్లోనూ పులగం చిన్నారాయణ మరికొన్ని దేశాలకు చెందిన సినిమాలను పరిచయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ పుస్తకం ముందు మాటలో ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి చెప్పినట్టుగా ఇందులోని వ్యాసాలు మనలోని పాత జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. గతంలో చూసిన సినిమాలను మరోసారి, చూడని సినిమాలను తక్షణమే చూసేలా చేస్తాయి. సినిమా రంగానికి చెందిన వారు, సినీ ప్రేమికులు విస్మరించలేని పుస్తకం ఇది.

- వి. కార్తికేయ