మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన బాలల చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. బుధవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘మనకు చిల్డ్రన్ సినిమాలు వచ్చి చాలా కాలం అవుతోంది. పిల్లలతో తీసిన సినిమా ఈ వేసవిలో అందరినీ ఎంటర్‌టైన్ చేయాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
డైరెక్టర్స్ సాయి రాజేష్, రాహుల్ రవీంద్రన్, రామ్ అబ్బరాజు, రవి నంబూరి, పవన్ సాధినేని, నందకిషోర్, కౌశిక్ మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘గత డిసెంబర్‌లో ఈ కథ విన్నా. నా ఫ్రెండ్ గిరి నాపై నమ్మకంతో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు.
ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ చేశాం. సమ్మర్‌లో రిలీజ్ అనుకున్నా బెటర్‌మెంట్స్, ఇతర కారణాలతో రిలీజ్ చేయలేకపోయాం. ఆలస్యమైనా బెస్ట్ కంటెంట్‌తో వస్తున్నాం. ఇలాంటి జానర్‌లో ఏడాదికి ఒక సినిమా వచ్చినా పిల్లలు, ఫ్యామిలీస్ థియేటర్స్‌కు వెళ్తారని నమ్మాను’ అని చెప్పారు. నటీనటులు రాజీవ్ కనకాల, వాసుకి, బాల నటులు రోహన్, అరుణ్, ఖుషి, ప్రొడ్యూసర్ గిరిబాబు, డైరెక్టర్ శ్రీకర్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి తదితరులు పాల్గొన్నారు.
