తైవాన్‌ ను వణికిస్తున్న చాంపి తుఫాన్.. వెయ్యి విమానాలు రద్దు..ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన సైక్లోన్

తైవాన్‌ ను వణికిస్తున్న చాంపి తుఫాన్.. వెయ్యి విమానాలు రద్దు..ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన సైక్లోన్

తైవాన్‌ ను  చాంపి తుఫాన్ వణికిస్తోంది.చాంపి తుఫాను కారణంగా ఒకరు మృతిచెందగా 94 మంది గాయపడ్డారు. 77వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెయ్యి విమానాలు రద్దయ్యాయి. 12వందల 86 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

తైవాన్‌ను తీవ్రంగా చాంపిసూపర్‌ తుఫాను అతలాకుతలం చేస్తోంది. 8 మీటర్ల ఎత్తు వరకు ఉన్న అలలు తైతుంగ్ తీరాన్ని తాకాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను 2026 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన ముప్పుగా మారింది. తొలుత గంటకు 296 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ తుఫాను, తైవాన్ వైపు వచ్చేసరికి కాస్త బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ గంటకు 191 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

తైవాన్ లో చాంపి తుఫాను ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంది. తైవాన్ దేశమంతటా దీని ప్రభావం కనిపిస్తోంది. ఈశాన్య తీర ప్రాంతాలు, రాజధాని తైపీ నగరాలు భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. కొన్ని కొండ ప్రాంతాల్లో దాదాపు 90 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తుఫాను భీభత్సం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. తైవాన్‌లోని దాదాపు 20 నగరాలు, కౌంటీలలో పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు, వ్యాపార సంస్థలు, అక్కడి ఆర్థిక మార్కెట్లను పూర్తిగా మూసివేశారు. చాంపి తుఫాన్ తో రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. తైవాన్ వ్యాప్తంగా 260కి పైగా దేశీయ విమానాలు, 700కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

సముద్రంలో ఎగిసిపడుతున్న 8 మీటర్ల (26 అడుగులు) ఎత్తైన భారీ అలల దాటికి ఒకరు మృతిచెందగా.. 170 మందికి పైగా గాయపడ్డారు. తైతుంగ్ కౌంటీలోని ఫుగాంగ్ ఓడరేవులో ఓ భారీ క్రేన్ అలల తాకిడికి సముద్రంలో కూలిపోయింది.