Thug Life: ‘థగ్‌ లైఫ్‌’కు మేం సపోర్ట్ చేస్తాం.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం

Thug Life: ‘థగ్‌ లైఫ్‌’కు మేం సపోర్ట్ చేస్తాం.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించి, నిర్మించిన రీసెంట్ మూవీ ‘థగ్‌ లైఫ్‌’. ఈ మూవీని కర్ణాటకలోని థియేటర్లలో ప్రదర్శించకపోవడంపై సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని సూచించినందుకు కర్ణాటక హైకోర్టును కూడా తప్పుబట్టింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయాల్సిందేనని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంపై కర్నాటక ప్రభుత్వం స్పందన తెలపాలని ఆదేశిస్తూ.. ఒక రోజు టైం ఇచ్చింది. 

నేడు గురువారం (జూన్19న) ‘థగ్‌ లైఫ్‌’ అనధికారిక బ్యాన్‌కు సంబంధించిన  పిల్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వివాదాన్ని నేడు ముగించింది. థగ్ లైఫ్ స్క్రీనింగ్‌కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీంతో థగ్ లైఫ్ కన్నడ నాట ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.

ఇవాళ మధ్యాహ్నం కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మందలిస్తూ.. సినిమా రిలీజ్ పై నెలకొన్న బెదిరింపులను, అడ్డుకుంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మీ బాధ్యత అని సూచనలు ఇచ్చింది. తరచూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు ఆందోళనలు చేయడంతో కళాసృష్టి నిలిచిపోతోందని గుర్తుచేసింది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ డిమాండ్​ చేస్తూ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీం విమర్శించింది.

అసలేం జరిగిందంటే:

‘థగ్‌ లైఫ్‌’మూవీ జూన్ 5న కర్ణాటకలో విడుదల కావాల్సి ఉంది. కానీ కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యతో వివాదంలో చిక్కుకుంది. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య, ముఖ్యంగా కన్నడ అనుకూల వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పలు సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

Also Read : ‘కుబేర’ టికెట్‌ ధరల పెంపు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?

కానీ కమల్ హాసన్ దానికి అంగీకరించలేదు. తన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని మరియు తాను కన్నడ భాషను గౌరవిస్తానని ఆయన అన్నారు. హైకోర్టు కూడా కమల్ కామెంట్స్ ను తప్పుబడుతూ.. క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇక కర్ణాటక ప్రభుత్వం‘థగ్‌ లైఫ్‌’మూవీ బ్యాన్ చేయడంపై కమల్ హాసన్ సుప్రీంకోర్టు వెళ్లాడు. ఈ మూవీ స్క్రీనింగ్‌కు అనుమతులు మంజూరు చేయాలని.. బెంగళూరుకు చెందిన ఎం.మహేష్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని మందలిస్తూ.. రిలీజ్ కు పర్మిషన్ ఇచ్చింది.