ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ యాక్సెస్ పిల్లల  ప్రాథమిక హక్కే..వయసు ఆధారంగా నిషేధం కుదరదు: సుప్రీంకోర్టు

ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ యాక్సెస్ పిల్లల  ప్రాథమిక హక్కే..వయసు ఆధారంగా నిషేధం కుదరదు: సుప్రీంకోర్టు
  •     వయసు ఆధారంగా నిషేధం కుదరదు    రక్షణ, స్వేచ్ఛ రెండూ సమానమే
  •     సోషల్ మీడియా సంస్థలు, అధికారుల నిర్లక్ష్యంపై బెంచ్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆగ్రహం 


న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెద్దలకే కాకుండా చిన్నారులకూ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం ప్రాథమిక హక్కేనని  స్పష్టం చేసింది. వయస్సు ఆధారంగా పిల్లలపై ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్న ప్రతిపాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1) (ఏ) ప్రకారం ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండే ప్రాథమిక హక్కు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ చంద్రన్‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘పిల్లలకు వయస్సుతో సంబంధం లేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయి. ఒక నిర్ణీత వయస్సు లేని పిల్లలకు స్వేచ్ఛా వ్యక్తీకరణ హక్కు ఉండదనడం ఎంత హాస్యాస్పదమో, వారికి ఇంటర్నెట్ హక్కును తిరస్కరించడమూ అంతే అసంబద్ధం” పేర్కొన్నది.  పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్‌‌‌‌‌‌‌‌ అలయన్స్’ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో పిల్లలపై సాగే లైంగిక వేధింపుల సమాచారం (సీఎస్‌‌‌‌‌‌‌‌ఈఏఎం) నిరోధించడంలో సంస్థలు విఫలమవుతున్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

రక్షణ ముఖ్యం.. నిషేధం కాదు..

పిల్లల రక్షణ, వారి భావ ప్రకటనా స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైనవేమీ కావని, పిల్లలకు ఈ రెండూ దక్కాల్సిన అవసరం ఉందని కోర్టు గుర్తుచేసింది. ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌పై నిషేధం విధించినంత మాత్రాన పిల్లలు దానిని వాడటం ఆపబోరని వ్యాఖ్యానించింది. పూర్తి నిషేధానికి బదులుగా సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో కఠినమైన ‘పేరెంటల్ కంట్రోల్స్’, ‘చైల్డ్ మోడ్’ నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌‌‌‌‌‌‌‌ను తొలగించడంలో అధికారులు, సోషల్ మీడియా వేదికలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చిన్నారులపై హింసకు సంబంధించిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ను తక్షణమే గుర్తించి.. తొలగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ డేటాబేస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక మార్గదర్శకాలు  రూపొందించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

రోడ్డు సమస్య తీర్చకపోతే ధర్నా చేస్తం: సుప్రీం బెంచ్​

ఢిల్లీ హైకోర్టు పరిసరాల్లో రోడ్డు భద్రతా సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వంపై సుప్రీంకోర్టు  అసహనం వ్యక్తంచేసింది. నవంబర్ 25వ తేదీ నాటికి సమస్యకు పక్కా పరిష్కారం చూపకపోతే తామే స్వయంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగుతామని అధికారులకు చురకలంటించింది. ‘‘మీరు పనులు పూర్తి చేయకపోతే, మేమిద్దరం (ధర్మాసనం) ఢిల్లీ హైకోర్టు మెయిన్ గేట్ వద్ద కూర్చుంటాం. పనులు తేలేవరకు మేం ఇంటికి వెళ్లం.. మిమ్మల్ని కూడా ఇంటికి పోనివ్వం’’ అని వ్యాఖ్యానించింది.  హైకోర్టు సమీపంలోని మధుర రోడ్డు క్రాసింగ్ వద్ద పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యల లోపంపై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను బెంచ్​ విచారించింది.

అమికస్‌‌‌‌‌‌‌‌ క్యూరీని రంగంలోకి దించండి

 కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌‌‌‌‌‌‌‌జీ) వాదనలు వినిపిస్తూ.. ఉన్నత స్థాయి కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇలాంటి చిన్న సమస్యలకు ఉన్నత స్థాయి కమిటీలతో పనేంటని ప్రశ్నించింది. కేవలం కమిటీల సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించి పరిష్కరించడానికి అమికస్ క్యూరీని రంగంలోకి దించాలని సూచించింది. నవంబర్ 25లోగా సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ 
చేపట్టకపోతే, తదుపరి విచారణకు ఏఎస్జీతో పాటు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) కూడా స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.