రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్సింగ్ మేఘన'. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శామ్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి.
లేటెస్ట్ గా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'పిల్ల పిల్ల పిల్ల' ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. మూవీ టీమ్‌తో పాటు బెక్కం వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాటను విన్న సురేష్ బాబు 'పిల్ల పిల్ల పిల్ల' సాంగ్ చాలా బాగుందని ప్రశంసించారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. దీంతో ఈ పాటకు మరింత ప్రత్యేకత లభించింది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్‌కు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు గురించి అందరికీ తెలుసని.. అలాంటి ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా తమ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ వాచస్పతి. తనపై నమ్మకంతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత పంచుమర్తి నరేష్, కో-ప్రొడ్యూసర్ శ్రీనివాస్, తమను ప్రోత్సహిస్తున్న బెక్కం వేణుగోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటను జావేద్ అలీ పాడటం, ధృవన్ సంగీతం అందించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నిర్మాత నరేష్, హీరో రామ్ కార్తీక్, సంగీత దర్శకుడు ధృవన్ కూడా ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన తమ సినిమా నుంచి అదే స్టూడియోకు చెందిన సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ విడుదల కావడం సంతోషంగా ఉందని నరేష్ తెలిపారు. ఇది మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేలా రూపొందుతోందని హీరో రామ్ కార్తీక్ చెప్పారు.
