సూర్యాపేట జిల్లాలో భూ అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో ముగ్గురు రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హుజూర్‌నగర్ తహసీల్దార్ బి.కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కాశీం షరీఫ్, గ్రామ పాలన అధికారి (జీపీవో) ఎస్.కె. జానీ పాషాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో శాఖపరమైన విచారణ చేపట్టారు.
హుజూర్‌నగర్ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత భూముల రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలపై రిపోర్టు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో చర్యలు చేపట్టారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (NSP) కాలువ భూములు, భూ పరిమితి చట్టం పరిధిలోకి వచ్చే భూములను అక్రమంగా బదలాయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూముల లావాదేవీల్లో నిబంధనలు పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
