ఎల్ నినో ఎఫెక్ట్.. సూర్యాపేటలో 4 ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

ఎల్ నినో ఎఫెక్ట్.. సూర్యాపేటలో 4 ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

సూర్యాపేట జిల్లా: ఎల్నినో ప్రభావంతో నీటి కొరత, విద్యుత్ కోతల కారణంగా వరి పంట ఎండిపోవడంతో ఓ కౌలు రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చేసేదేమీ లేక తన నాలుగు ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్‌) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ఆత్మకూర్ (ఎస్‌) మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు యాతాకుల మల్లయ్య నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట సాగు కోసం పెట్టుబడి పెట్టడంతో పాటు కౌలు చెల్లించినప్పటికీ, నీటి కొరత మరియు విద్యుత్ కోతల కారణంగా పంట ఎండిపోయింది. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మల్లయ్య, ఎండిపోయిన వరి చేనుకు నిప్పు పెట్టాడు.

పంట సాగు కోసం చేసిన ఖర్చులతో పాటు కౌలు కూడా నష్టపోవాల్సి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇలాంటి పరిస్థితులు మరింత భారంగా మారుతున్నాయి.

తనకు జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని యాతాకుల మల్లయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, అర్హత మేరకు పరిహారం అందించాలని రైతు కోరుతున్నాడు.