సిరాజ్ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్.. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కి జమ్మూ పేసర్ ఆకిబ్ నబీ ఛాన్స్

సిరాజ్ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్.. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కి జమ్మూ పేసర్ ఆకిబ్ నబీ ఛాన్స్

IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున సిరాజ్ ఆడాడు. ఈ సుదీర్ఘ సీజన్ కారణంగా అతనిపై పడిన పని భారాన్ని (Workload) దృష్టిలో పెట్టుకుని, అతనికి విశ్రాంతినివ్వాలా వద్దా అనే విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం సిరాజ్ చండీగఢ్‌లో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు.

రేసులోకి జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ
మహ్మద్ సిరాజ్ లాంటి సీనియర్ బౌలర్ అందుబాటులో లేకపోతే అనుభవం లేని పేస్ బౌలింగ్‌తో బరిలోకి దిగడానికి సెలక్టర్లు మొదట సుముఖంగా లేనప్పటికీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ సిరాజ్‌కు విశ్రాంతిని ఇస్తే, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి జట్టులోకి పిలుపు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం భారత జట్టుకు నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న ఆరుగురు బౌలర్లలో (గుర్జప్‌నీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, సరాంశ్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్) ఆకిబ్ నబీ కూడా ఒకడిగా ఉన్నాడు.

ముల్లాన్‌పూర్‌లో భారత జట్టు ప్రాక్టీస్: 
మరోవైపు ఈ టెస్ట్ మ్యాచ్ కోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఈరోజు (2026, జూన్ 3న) ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి చేరుకుంది. కెప్టెన్ గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సహా మిగిలిన ఆటగాళ్లంతా మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించారు. సిరాజ్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత వస్తే బౌలింగ్ విభాగంపై ఒక అంచనాకు రావచ్చునని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.