సంగీత దర్శకుడు దేవా కుటుంబంలో మరో విషాదం.. 37 ఏళ్లకే నటుడు కార్తీక్ సబేష్ కన్నుమూత!

సంగీత దర్శకుడు దేవా కుటుంబంలో మరో విషాదం.. 37 ఏళ్లకే నటుడు కార్తీక్ సబేష్ కన్నుమూత!

తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆయన కుటుంబాన్ని మరో విషాదం కుదిపేసింది. దేవా సోదరుడు, దివంగత సంగీత దర్శకుడు ఎంసీ సబేష్ కుమారుడు, నటుడు కార్తీక్ సబేష్ (37) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు.  వరుస మరణాలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

దేవా మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు దేవా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే కార్తీక్ సబేష్ మరణవార్త మరింత బాధాకరంగా మారింది. కార్తిక్ సబేష్‌కు భార్య రమ్య కార్తిక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. 

కార్తిక్ కుటుంబానికి గత ఏడాది కూడా తీరని నష్టం ఎదురైంది. ఆయన తండ్రి, సంగీత దర్శకుడు ఎంసీ సబేష్ 2025 అక్టోబర్ 23న చెన్నైలో 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు తండ్రి మరణించిన ఏడాదిలోపే కార్తీక్, ఆయన బాబాయి దేవా మృతిచెందడం కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చాయి.

కార్తీక్ సబేష్ తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 'ధమ్', 'వల్లవన్', 'పట్టత్తు యానై', 'ఉదయం ఎన్‌హెచ్4', 'బర్మా', 'కాదల్ సొల్ల వందేన్', 'కులిర్ 100' వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రధాన పాత్రలు కాకపోయినా, తనకు వచ్చిన అవకాశాలతో నటుడిగా కొనసాగారు.

ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ మరణాలు తమిళ సినీ పరిశ్రమను కలచివేస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.