విజయ్ విశ్వాస పరీక్ష: 59 మంది డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్.. 117 నుంచి 88కి పడిపోయిన మేజిక్ ఫిగర్ !

విజయ్ విశ్వాస పరీక్ష: 59 మంది డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్.. 117 నుంచి 88కి పడిపోయిన మేజిక్ ఫిగర్ !

చెన్నై: తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఆసక్తికరంగా మారింది. టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. విశ్వాస పరీక్షలో ఓటింగ్కు దూరంగా ఉండాలని డీఎంకే నిర్ణయించింది. 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు ఈ విశ్వాస పరీక్షలో ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 232 నుంచి 173కి పడిపోయింది. 

ఈ కారణంగా.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మేజిక్ ఫిగర్ కూడా 88కి పడిపోయింది. దీంతో.. విజయ్ టీవీకే ప్రభుత్వం ఈ విశ్వాస పరీక్షలో అలవోకగా నెగ్గే అవకాశం ఉంది. పైగా.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్ పార్టీకి అదనపు బలంగా మారింది.

ఇదిలా ఉండగా.. టీవీకే ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆమోదం పొందడంలో టీవీకే విఫలమైందని ఆయన విమర్శించారు. విజయ్‌కు వ్యతిరేకంగా 65 శాతం మంది ఓటర్లు ఓటేశారని చెప్పారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ప్రజలు ఓటేశారని ఆయన గుర్తుచేశారు.

డీఎంకే కూటమిలోని పార్టీలే టీవీకేకు మద్దతిస్తున్నాయన్నది మర్చిపోవద్దని ఉదయనిధి విజయ్కి చురకలంటించారు. విజయ్‌కి నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదని ఉదయనిధి స్టాలిన్‌ తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా విశ్వాస పరీక్ష రోజునే టీవీకే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.