హైదరాబాద్: శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ పోలీసులు, రాజస్థాన్ పోలీసుల సహకారంతో కమిషనర్ టాస్క్‌ఫోర్స్ శంషాబాద్ జోన్ బృందం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రాజస్థాన్‌కు చెందిన రషీద్ అలియాస్ కాకూ అలియాస్ యూసుఫ్ అలియాస్ కాకే (34)ను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో పాటు వాహనాల చోరీ కేసుల్లోనూ అతడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 6, 2026న తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో శంషాబాద్ పరిధిలోని సాతంరాయి యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్న సీడీఎంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన బ్యాంక్ కమాండ్ సెంటర్ ముంబై నుంచి అలర్ట్ వచ్చింది. దీంతో బ్యాంక్ బ్రాంచ్ హెడ్ దొమ్మేటి అనిల్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలించగా, దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి, సీసీటీవీ కెమెరాలపై పెయింట్ స్ప్రే చేసి, అలారం వ్యవస్థకు సంబంధించిన వైర్‌ను కట్ చేసినట్లు గుర్తించారు. అనంతరం నగదును ఎత్తుకెళ్లారు. బ్యాంక్ లెక్కల ప్రకారం రూ.7,40,200 నగదు చోరీ అయినట్లు నిర్ధారించారు.
పోలీసుల విచారణలో నిందితులు ముందస్తు ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. రాజస్థాన్‌కు చెందిన రషీద్, పరారీలో ఉన్న షంషుద్దీన్ నెల రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి గ్యాస్ కట్టింగ్ పరికరాలు, పెయింట్ స్ప్రే సామగ్రిని పహాడీషరీఫ్ ప్రాంతంలోని పొదల్లో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రషీద్‌తో పాటు సోహైల్, ఫైజాన్ అలియాస్ అయాన్, రేహాన్ అలియాస్ జాంగీ హైదరాబాద్‌కు చేరుకుని ఆ సామగ్రిని తీసుకున్నారు.
చోరీకి ఉపయోగించేందుకు తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని, ఆ తర్వాత శాంట్రో కారును దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని, సీసీటీవీ కెమెరాలపై పెయింట్ స్ప్రే చేసి, అలారం వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచారు. నగదు ట్రేలను కారులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
