- ఆర్థిక శాఖ అనుమతి.. జీవో142 జారీ
- అత్యధికంగా ఓయూలో 252,
- కేయూ, శాతవాహనలో 49 ఖాళీలు
- కామన్ గైడ్‌లైన్స్, రోస్టర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశం
- ఫస్ట్ ఫేజ్‌లో 7 వర్సిటీల్లో నియామకాలు
- ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో నియామకాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఏడు వర్సిటీల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో నెంబర్ 142 రిలీజ్ చేశారు. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చిన నివేదిక , ఆయా వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ (ఈసీ) ఆమోదించిన ఖాళీల ఆధారంగా ఈ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేశారు.
యూనిఫాం నిబంధనల ప్రకారమే భర్తీ
ఈ నియామకాలను ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన యూనిఫాం మార్గదర్శకాలకు లోబడి చేపట్టాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అర్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, ఇతర చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీతో పాటు సంబంధిత యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరిసారిగా వర్సిటీల్లో 2013లో పోస్టులు భర్తీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో కొంత ప్రయత్నం చేసినా.. ప్రక్రియ ముందుకు సాగలేదు.
వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు..
యూనివర్సిటీలవారీగా ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు రానున్నాయి. కానీ స్ర్కీనింగ్ ప్రక్రియ మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించనున్నది. దీన్ని నోటిఫికేషన్లలో స్పష్టంగా పేర్కొననున్నారు. దీని ప్రకారం దరఖాస్తుల స్వీకరణతో పాటు ఒక్కో పోస్టుకు 1:10 లేదా 1: 12 చొప్పున స్ర్కీనింగ్ చేసి.. వర్సిటీలకు పంపించనున్నారు. ఆ తర్వాత రెండు ప్రక్రియలను యూనివర్సిటీలు నిర్వహించనున్నాయి. కాగా, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.
సింహభాగం ఓయూలోనే
మొత్తం ఖాళీల్లో సగానికిపైగా ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే ఉన్నాయి. క్యాంపస్ విభాగాలతో పాటు సిద్దిపేట, జోగిపేట, నర్సాపూర్ పీజీ కాలేజీల్లోని పోస్టులు ఇందులో ఉన్నాయి. ఎకనామిక్స్ – 18, లా – 16, సివిల్ ఇంజినీరింగ్–15, ఫిజికల్ ఎడ్యుకేషన్–13, ఇంగ్లిష్–12, మెకానికల్ ఇంజినీరింగ్–12, పొలిటికల్ సైన్స్–12, బోటనీ–9, స్టాటిస్టిక్స్–7, జువాలజీ–7, బిజినెస్ మేనేజ్మెంట్–7, జాగ్రఫీ–7, కామర్స్– 6, జెనెటిక్స్–6, లింగ్విస్టిక్స్–5, ఫిలాసఫీ–5, జియాలజీ–5, జియోఫిజిక్స్–5, మ్యాథమెటిక్స్– 5 తదితర ప్రధాన విభాగాల్లో ఖాళీలున్నాయి. వీటితో పాటు ఓయూ పీజీ సెంటర్లలో సిద్దిపేట (ఇంగ్లిష్–2, జర్నలిజం–2, ఎకనామిక్స్–2),; జోగిపేట (ఇంగ్లిష్–1, కెమిస్ట్రీ–1, మ్యాథ్స్–1); నర్సాపూర్ (ఆర్గానిక్ కెమిస్ట్రీ–1, ఇనార్గానిక్ కెమిస్ట్రీ–1, మ్యాథ్స్–1) ఖాళీలున్నట్టు ప్రకటించారు.
ఇతర యూనివర్సిటీల్లో ముఖ్యమైన ఖాళీలు:
కేయూ (49): జువాలజీ (6), కామర్స్ (5), ఎకనామిక్స్ (5), ఇంగ్లిష్ (5), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (4), హిస్టరీ (3), తెలుగు (3), బోటనీ (2), కెమిస్ట్రీ (2), సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ (2), హిందీ (2), బయోటెక్నాలజీ, లా, లైబ్రరీ సైన్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ తదితరాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
శాతవాహన యూనివర్సిటీ (49): హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ (7), సీఎస్ఈ–ఏఐ (7), ఈసీఈ (7), ఐటీ (5), మెకానికల్ (2), మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. వర్సిటీ లా కాలేజీలో 8 ఖాళీలు, ఫార్మసీలో 2, కామర్స్‌లో ఒక పోస్టు ఉన్నాయి.
పాలమూరు యూనివర్సిటీ (45): లా విభాగంలో 8, సీఎస్ఈలో 6, సీఎస్ఈ–ఏఐ అండ్ ఎంఎల్ లో 6, సీఎస్ఈ–డేటా సైన్స్‌లో 6 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇంజినీరింగ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగంలో 10 పోస్టులు, ఇంగ్లిష్‌లో 4, బోటనీలో 2 ఉన్నాయి.
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ (16): కంప్యూటర్ సైన్స్ (2), బిజినెస్ మేనేజ్మెంట్, హిందీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఈఎంఆర్ అండ్ ఆర్సీల్లో ఒక్కొక్క పోస్టు ఉన్నాయి.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ (16): జర్నలిజం (2), స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ (2), డాన్స్ (2), జానపద కళలు (2), తెలుగు సాహిత్యం (2), హిస్టరీ అండ్ టూరిజం (2), లింగ్విస్టిక్స్, సంగీతం, థియేటర్ ఆర్ట్స్, జ్యోతిష్యం అండ్ వాస్తు విభాగాల్లో ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ యూనివర్సిటీ (02): సోషల్ వర్క్ – 1, లా – 1.
వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
యూనివర్సిటీ పోస్టులు
ఉస్మానియా 252
కాకతీయ 49
శాతవాహన 49
పాలమూరు 45
అంబేద్కర్ ఓపెన్ 16
తెలుగు యూనివర్సిటీ 16
తెలంగాణ వర్సిటీ 02
