హైదరాబాద్, వెలుగు: దేశంలో బంగ్లాదేశ్ తరహా అరాచకం, హింస సృష్టించి పాలన మార్పునకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. దీనిపై కాంగ్రెస్ వైఖరేమిటో చెప్పాలని డిమాండ్చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమనే రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తదితరులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.
బంగ్లాదేశ్ పరిణామాల నుంచి ప్రేరణ పొంది భారత్లోనూ పాలన మార్పు తీసుకొస్తామన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. న్యాయవ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు రాహుల్ గాంధీ, అర్బన్ నక్సలైట్లు వ్యూహాత్మకంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, సీఈసీ జ్ఞానేశ్కుమార్లకు వ్యతిరేకంగా మాత్రమే వీరి ప్రయత్నాలు లేవని, అక్రమ మార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే
లక్ష్యమని ఫైర్అయ్యారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నాకు మద్దతు
రాష్ట్రంలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన మహాధర్నాకు హాజరై, మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యోగుల్లో 70 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
