వెలుగు స్పెషల్ : విద్యకు ప్రాధాన్యం పెంచిన సీఎం

వెలుగు స్పెషల్ : విద్యకు ప్రాధాన్యం పెంచిన సీఎం

దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందనే నిజాన్ని నిరూపించే విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ ప్రశంసనీయం. భారతదేశంలో విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ఏకైక  ముఖ్యమంత్రిగా అనుక్షణం పర్యవేక్షిస్తూ, దేశ స్థాయిలో 28వ స్థాయిలో అట్టడుగున ఉన్న తెలంగాణ విద్య స్థానాన్ని రెండేళ్లు తిరగకముందే 17వ స్థానానికి చేర్చేలా అనితర ప్రయత్నం చేశారు.  

రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి విద్యా సంవత్సరంలోనే  విద్యకు  బడ్జెట్​లో 15 శాతం పైగా నిధులు కేటాయిస్తామన్నారు. కాకపోతే గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా బడ్జెట్​ కేటాయిస్తూ వస్తున్నారు. బడ్జెట్​లో  సుమారు 8 శాతం  కేటాయించి,  కేంద్రం నుంచి  గత  మూడేళ్లలో వచ్చిన రూ.5వేల కోట్లను విడుదల చేసి  ప్రాథమిక, ఉన్నత విద్యకు ధాన్యతనిచ్చారు. సమీకృత, సఫలీకృత విద్యను ప్రపంచీకరణ వైపు పరుగులు తీయిస్తున్నారు.  కేవలం 55 రోజుల్లోనే  డిఎస్సీ ద్వారా  సుమారు10వేలకు పైగా  టీచర్ల భర్తీని తక్కువ సమయంలో  పూర్తి చేశారు.

విద్యలో రేవంత్ మార్క్ 

రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, బెంచీలు, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ ల కోసం నేటి వరకు రూ. 80 వేల కోట్లకు పైగా  ఖర్చు చేశారు.  అలాగే  పాఠశాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచటానికి స్కావెంజర్ లను నియమించడం అంత తేలికైన పని కాదు. 2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే స్వయంగా పరిశుభ్రతకు ఉపక్రమించేవారు. మరి కొందరు ఉపాధ్యాయులే సొంత డబ్బులు ఇచ్చి పాఠశాల పరిసరాలను ఊడిపించేవారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి  ప్రశాంత వాతావరణం వైపు బడి పరిసరాలను తీసుకువెళ్ళారు.  

అదనపు తరగతి గదుల నిర్మాణం,   ప్రహరీ గోడ  నిర్మాణాలు చేసి ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పైగా నిధులు సమకూర్చారు. పాత విద్యుత్ బకాయిలను చెల్లించి,  ప్రతి పాఠశాలకు, అంగన్ వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం, తరగతి గదిలో ఫ్యాన్లను, బల్బులను ఏర్పర్చి డిజిటల్ విద్య కల్పించిన ఘనత నేటి  ప్రభుత్వానిదే.  విదేశాలకు ఉపాధ్యాయుల బృందాన్ని పంపించారు. అక్కడ అమలు అవుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకునేందుకు పంపారు.   జర్మనీ,  జపాన్,  సింగపూర్ , వియత్నాం, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపి అక్కడి విద్యను పరిశీలించి ఇక్కడి విద్యాభివృద్ధి అమలుకు కృషి చేయడం మామూలు విషయం కాదు.

ఉచిత విద్య అందరి సొత్తుగా..

గత ఏడాది నుంచి పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా నేడు 4131 పాఠశాలకు ఇన్​స్ట్రక్టర్లను, ఆయాలను నియమించడంతోపాటు ఇన్‌‌స్ట్రక్టర్‌‌‌‌కు ప్రతి నెల రూ.8 వేల గౌరవ వేతనాన్ని, ఆయాలకు రూ.6 వేలను అందించడానికి ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు 1 కోటి 70 లక్షల రూపాయలను ఖర్చు చేశారు.  గత ప్రభుత్వం కన్నా  విద్యకు ప్రాధాన్యం పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, పాఠశాలల్లో బ్రేక్‌‌ఫాస్ట్ పథకం తెచ్చారు. 

దీంతో పాఠశాలకు విద్యార్థుల హాజరుశాతం పెరగడమే కాకుండా సరైన పౌష్టికాహారం వారి శరీరానికి అంది  విద్యపై  ఏకాగ్రతను  కలిగిస్తుంది   ప్రపంచ విద్యతో   పోటీ పడేలా ఇక్కడి విద్యా వ్యవస్థ తట్టుకునేలా సమగ్ర చర్యలను తీసుకోవడమే కాకుండా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను  అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర విద్యను  మునుపెన్నడూ లేనివిధంగా బలోపేతం చేస్తున్నారు.   తెలంగాణ భవిష్యత్తు పురోగతికి  ఉద్యోగ, ఉపాధ్యాయ బృందం నిరంతరం నిమగ్నమై శ్రమిస్తూనే ఉంటుంది.

 వర్సపల్లి నర్సింహులు,ప్రభుత్వ ఉపాధ్యాయుడు 
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.