- .. నీళ్లు, కరెంటు వృథా చేయొద్దు
- ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీళ్లకూ ఇబ్బంది తప్పదు
- ఎండలకు జనం ఇళ్లలోంచి బయటకొచ్చే పరిస్థితి ఉండదు
- ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు.. యాసంగిలో పంటలు వేయకండి
- హరీశ్ మాటలు విని పంటలేస్తే మట్టితో అంబలి తాగాల్సి వస్తది
- ప్రతి కుటుంబానికీ పని.. తాగు నీటి సమస్యపై టోల్ ఫ్రీ నంబర్
- సంక్రాంతి నుంచి మే వరకు ప్రజాప్రతినిధులు పల్లెబాట పట్టాలె
- వడ దెబ్బతో ప్రజల ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- ఎల్‌నినోపై ప్రతి రోజూ బులెటిన్ విడుదల చేస్తాం
- ప్రజాభవన్‌లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు:ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో తలెత్తిన కరువును తేలిగ్గా తీసుకోవద్దని, దాచిపెడ్తే ఇది క్యాన్సర్‌లా మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మెల్లమెల్లగా కబళిస్తుందని హెచ్చరించారు. ‘‘రాబోయే 8 నెలలు కరువు ప్రభావం ఉంటుంది.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తీవ్రరూపం దాలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టుల్లో నీటినిల్వలు 20 శాతానికి, భూగర్భ జలాలు 50 శాతానికి పడిపోయాయి.
ముందుముందు గుక్కెడు తాగునీళ్లకూ కష్టం వస్తుంది. ఎండ వేడికి ఇళ్లలోంచి వచ్చే పరిస్థితి ఉండదు’’ అని పేర్కొన్నారు. ఎల్‌నినో కూడా కరోనాలాంటి విపత్కర పరిస్థితేనని తెలిపారు. శుక్రవారం సాయంత్రం పీసీసీ ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంపై ఎల్‌నినో ఎఫెక్ట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత, ‘సర్’కు వ్యతిరేకంగా వచ్చే నెల 1న ఏఐసీసీ తలపెట్టిన భారీ సభకు రాష్ట్రం నుంచి చేయాల్సిన జన సమీకరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నది.. కానీ ఎల్‌నినో ప్రభావం మన దగ్గరే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో, మన పక్క రాష్ట్రాల్లోనూ ఉంది.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నీటిని రేషన్‌గా ఇస్తున్నారు.. అక్కడ 20 శాతం నీటిని పొదుపుచేయాలని నిర్ణయించారు’’ అని వ్యాఖ్యానించారు.
వచ్చే 8 నుంచి 10 నెలలపాటు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నామని, మున్ముందు తాగడానికి కూడా చుక్క నీరు దొరకని పరిస్థితి రానుందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వచ్చే జులై వరకు తాగు నీటి కష్టాలు ఉంటాయని, ఎండ వేడి పెరిగి ప్రజలు ఇళ్ల లోనుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.రాబోయే రోజుల్లో కరెంట్ కష్టాలు తప్పవని, యూనిట్‌కు రూ.15 పెట్టి కొందామన్నా విద్యుత్దొరకడం లేదని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంత విద్యుత్ డిమాండ్ ఇప్పుడు రాష్ట్రంలో ఉందని, 20 వేల మెగావాట్ల డిమాండ్ఉన్నా అప్పులు తెచ్చి కరెంట్ కొని సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కరెంటును పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పగలు ఫ్యాన్లు వేయొద్దని, ఏసీల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులంతా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తమ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన కరెంట్‌ను అమ్ముకుంటున్నారని వివరించారు.
క్షుద్రపూజలు చేసే వాళ్ల మాటలు నమ్మొద్దు ఎల్‌నినో పరిస్థితులపై సలహాలు, సూచనల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని, సరైన సమాచారం అందించేందుకు నోడల్ ఆఫీసర్‌గా రామకృష్ణారావును నియమించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కరువుపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, కరువు రావాలని క్షుద్రపూజలు చేసే వాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు.
‘‘కేసీఆర్, హరీశ్తాము మాత్రమే తెలివైన వాళ్లు అనుకుంటున్నారు.. కరోనా సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తే వాళ్లకు మాస్కులు ఇవ్వాలని, క్రోసిన్ వేసుకోవాలని సీఎం హోదాలో కేసీఆర్ అవహేళన చేశారు. ఆయన మాటలు నమ్మి మాస్కులు పెట్టుకోని వారు కనుమరుగయ్యారు . ఆయన మాటలు నమ్మని మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం’’ అని ఎద్దేవా చేశారు. 3 నెలల క్రితం తాము ఎల్‌నినో పై మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదని, కానీ తమకు నీళ్లు కావాలని, కరెంట్ కావాలని ఎమ్మెల్యేలు ఇప్పుడు అడుగుతున్నారని రేవంత్ చెప్పారు.
హరీశ్ మాటలు విని యాసంగిలో పంటలు వేస్తే మట్టితో అంబలి తాగాల్సి వస్తుందని హెచ్చరించారు. కరువును కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ముఖ్యంగా తాగునీరు, కరెంట్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల్లో అరకొరగా ఉన్న నీళ్లను తాగు అవసరాలకే వాడుకోవాలని, కూరగాయలు తప్ప యాసంగిలో పంటలు వేయవద్దని రైతులకు సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే పని కల్పిస్తుందని చెప్పారు.
ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాటపట్టాలి
బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్‌నాయకులకు ఓపిక లేకుండాపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజాలు వివరించకపోతే రాజకీయంగా దెబ్బతింటామని, ప్రతిపక్షాల ప్రచారాన్నే జనం నమ్ముతారని చెప్పారు. సంక్రాంతి తర్వాత నుంచి మే నెలాఖరు వరకు 4 నెలల పాటు ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాట పట్టాలని, ప్రజల మధ్యే ఉంటూ వారికి వాస్తవాలను వివరించాలని సూచించారు.
అందరినీ ప్రత్యేక యాప్‌తో మానిటరింగ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో, ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో మట్టి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని, ప్రతి ఒక్కరికి పని కల్పించి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. ఈ పథకానికి మంచి పేరును సూచించాలని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
తాగు నీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి..
కరువును ఎదుర్కొనేందుకు అధికారులు అలర్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేబినెట్ సబ్‌కమిటీతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగం తాగునీటిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలన్నారు. యాసంగిలో కూరగాయలు తప్ప ఇతర పంటలు వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో రైతు వేదికల్లో వారానికోసారి అవగాహన కల్పిస్తున్న మంత్రి తుమ్మలను సీఎం అభినందించారు. పశు సంపదను కూడా కాపాడుకోవాలని, వాటికి అవసరమైన పశు గ్రాసం, నీటి వసతులు కల్పించాలని సూచించారు.
‘‘ఎల్‌నినోపై ప్రతి రోజు ఒక బులెటిన్ విడుదల చేస్తాం.. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రోజువారీ సమాచారం ఇస్తారు.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్‌లో హెల్ప్ డెస్క్ పెట్టి సమన్వయం చేస్తారు. ప్రజలకు వాస్తవాలు వివరించండి. ఏ విషయాలూ దాచిపెట్టొద్దు” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
30 లక్షల పంప్‌సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయి. ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవు. కృష్ణాలో 200 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఇలాంటప్పుడు తాగునీటి అవసరాలు తీర్చుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇంక వ్యవసాయానికి నీళ్లు ఎలా ఇవ్వగలం?
- సీఎం రేవంత్‌రెడ్డి
