- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో ఏర్పాటు
- స్పెషల్ ఇన్వైటీగా కే రామకృష్ణారావు.. కన్వీనర్‌గా ప్లానింగ్ సెక్రటరీ
- కేంద్రంతో సంప్రదింపులు, నిధుల సమీకరణపై కమిటీకి పూర్తి బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ముప్పుతో ముంచుకొస్తున్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, తగిన నివారణ చర్యలను సిఫారసు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ సీఎస్ సంజయ్ జాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పడిపోవడం, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, పశుసంవర్ధక రంగాలపై ఎల్‌నినో చూపే విపరిణామాలను నిశితంగా అంచనా వేయడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. అత్యవసర ప్రణాళికతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయక నిధులను రాబట్టేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే విస్తృత అధికారాలను ఈ సబ్ కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది.
కీలక శాఖల మంత్రులకు స్థానం
ఈ కేబినెట్ సబ్ కమిటీలో కీలక శాఖల మంత్రులకు స్థానం కల్పించారు. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనుండగా.. సివిల్ సప్లై, ఇరిగేషన్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని సభ్యులుగా చేర్చారు.
ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్- అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ సబ్ కమిటీకి ‘ప్రత్యేక ఆహ్వానితుడు’గా వ్యవహరించనున్నారు. ఈయన శాఖల మధ్య సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించనున్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
కాగా, ఈ సబ్ కమిటీ రాష్ట్రంలోని కరువు పరిస్థితులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలకు అవసరమైన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు జారీ చేయనుంది. వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పశుగ్రాసం కొరత రాకుండా చూడటం, వేసవిలో తాగునీటి సరఫరా, వ్యవసాయానికి కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వానికి నిర్దిష్ట సిఫారసులు చేయనుంది.
