టీడీఆర్ పోర్టల్‌‌ లో ఆధార్ అథెంటికేషన్‌‌ కు గ్రీన్ సిగ్నల్... జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

టీడీఆర్ పోర్టల్‌‌ లో ఆధార్ అథెంటికేషన్‌‌ కు గ్రీన్ సిగ్నల్... జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఆన్‌‌లైన్ నగదు బదిలీ సౌకర్యం ఉన్న అభివృద్ధి హక్కుల (టీడీఆర్) పోర్టల్‌‌లో నకిలీలు, మోసపూరిత లావాదేవీలను అరికట్టడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్‌‌లో ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రవేశపెడుతూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)ల అనుమతుల మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కొత్త విధానం ప్రకారం ఆన్‌‌లైన్ పోర్టల్‌‌లో ‘యెస్/నో’లేదా ఈ-కేవైసీ పద్ధతి ద్వారా వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరిస్తారు. టీడీఆర్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్, లాగిన్, దరఖాస్తుల సమర్పణ, ఆస్తి డేటాబేస్‌‌తో లింక్ చేయడానికి ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లు ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), జీహెచ్‌‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పరిపాలనాపరమైన లాగిన్లకు కూడా ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. 

అయితే, ఈ ఆధార్ ధ్రువీకరణ అనేది పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన లేదా సాంకేతిక కారణాలతో అథెంటికేషన్ విఫలమైన పౌరులకు సేవలను నిరాకరించకూడదని జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా పాస్‌‌పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు వంటి ఇతర గుర్తింపు కార్డులను ఆమోదించాలని సూచించారు. ఈ కొత్త నిబంధనలు  తెలంగాణ గెజిట్‌‌లో ప్రచురితమైన తేదీ నుంచి వెంటనే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.