చెప్పకుండానే రెండు డీమ్డ్ వర్సిటీలు... యూజీసీ ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ సర్కారు సీరియస్  

చెప్పకుండానే రెండు డీమ్డ్ వర్సిటీలు... యూజీసీ ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ సర్కారు సీరియస్  
  • హైకోర్టు మధ్యంతర ఆదేశాలనూ ఖాతరు చేయని కమిషన్
  • స్టేట్ ఎన్వోసీ లేకుండానే అనుమతులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు వ్యవహారంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోకుండానే, కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే 2 ప్రైవేట్ సంస్థలకు డీమ్డ్ వర్సిటీ హోదా కల్పిస్తూ యూజీసీ ఆదేశాలిచ్చింది. 

హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ యూజీసీ వ్యవహరించిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికితోడు స్టేట్ లో మరో 7 డీమ్డ్ వర్సిటీలకు పర్మిషన్ ఇచ్చేందుకు యూజీసీ సమాయత్తం అవుతున్నట్టు సమాచారం అందింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాలరాయడంపై కేంద్ర విద్యాశాఖతో పాటు యూజీసీకి త్వరలోనే  లేఖ రాయాలని ప్రభుత్వం 
నిర్ణయించింది.

సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినా..

డీమ్డ్ వర్సిటీల వ్యవహారంలో రాష్ట్రాల పాత్రను తగ్గించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి, యూజీసీకి లేఖ రాశారు. అంతేకాకుండా టీజీసీహెచ్​ఈ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ పెద్దలను, యూజీసీ అధికారులను కలిసి రాష్ట్రాల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం, యూజీసీ ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కనబెట్టి అనుమతులు ఇచ్చేశాయి. 

రాజ్యాంగం ప్రకారం విద్య అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కానీ, కేంద్రం ఫెడరల్ స్ఫూర్తిని గాలికొదిలేసి రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర సర్కార్ ఆగ్రహంగా ఉంది. స్థానిక విద్యార్థుల రిజర్వేషన్లు, ఫీజుల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, అలాంటప్పుడు రాష్ట్రానికి సంబంధం లేకుండా డీమ్డ్ వర్సిటీలకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది. 

యూజీసీకి త్వరలోనే లేఖ..

స్టేట్ గవర్నమెంట్ అధికారాలను తక్కువ చేసి చూడటం ఎంతమాత్రం సరికాదని, రాష్ట్ర ఎన్వోసీ లేకుండా ఇచ్చిన అనుమతుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూజీసీకి, కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే లేఖ రాయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో న్యాయపరమైన కసరత్తు పూర్తయింది. ఒకవేళ యూజీసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే హైకోర్టు దృష్టికి ఈ ఉల్లంఘనలను తీసుకెళ్లి న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

2018లో నిబంధనలు మార్చి..

డీమ్డ్ యూనివర్సిటీల అనుమతులకు సంబంధించి గతంలో పటిష్టమైన నిబంధనలు ఉండేవి. 2010 నుంచి 2016 వరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ ఉంటేనే యూజీసీ అనుమతులు మంజూరు చేసేది. అయితే, 2018లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిబంధనలను ఏకపక్షంగా మార్చేసింది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. నేరుగా ప్రైవేటు సంస్థలు యూజీసీకి దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఎన్వోసీ లేకుండా డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడంపై గతంలోనే సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. 

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఒకవేళ యూజీసీ అనుమతులు ఇచ్చినా, అవి కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు పరిధిలో కేసు నడుస్తున్నప్పటికీ, ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా యూజీసీ తాజాగా 2 సంస్థలకు డీమ్డ్ హోదా కల్పిస్తూ పర్మిషన్లు జారీ చేయడం ఉన్నత విద్యావర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇటీవల యూజీసీ నిబంధనల్లో కొన్ని సవరణలు తెచ్చినప్పటికీ, ఆచరణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా పాత విధానాన్నే కొనసాగిస్తూ పర్మిషన్లు ఇస్తుండటం వివాదాస్పదంగా మారింది.