- సమగ్ర కార్యాచరణకు సర్కారు రెడీ
- కేబినెట్ సబ్ కమిటీ తొలి మీటింగ్‌లో తీర్మానం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
- నీటి ఎద్దడి దృష్ట్యా వరి వేయొద్దు: ఉత్తమ్
- రూ.7 వేల కోట్లతో కరువు పనులు: సీతక్క
హైదరాబాద్, వెలుగు: అర్హత కలిగిన కరువు మండలాలను అక్టోబర్ 31లోగా శాస్త్రీయంగా గుర్తించి కేంద్రానికి నివేదించాలని కేబినెట్ సబ్‌కమిటీ తీర్మానించింది. కరువు పరిస్థితులపై చర్చించేందుకు త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కరువుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు తాగు, సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయం, గ్రామీణ ఉపాధి రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఇప్పటికే తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు 20 శాతానికి మించి ప్రభావం ఉన్న మండలాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందే గుర్తించి అంతరాయాలు లేకుండా చూడాలని, శాఖల అత్యవసర ఖర్చులకు ఆర్థిక శాఖ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
358 మండలాల్లో కరువు పరిస్థితులు
రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వర్షపాతం, భూగర్భ జలాల తాజా పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో మొత్తంగా 24 శాతం వర్షపాతం లోటు నమోదైందని, మొత్తం 33 జిల్లాలకుగానూ18 జిల్లాల్లో లోటు వర్షపాతం, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 470 టీఎంసీల నిల్వ సామర్థ్యానికిగానూ ప్రస్తుతం కేవలం 170 టీఎంసీల జలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.
సింగూరు జలాశయంలో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. వర్షపాతలోటు, 50 శాతానికంటే తక్కువ పంట విస్తీర్ణం ఆధారంగా ప్రాథమికంగా 358 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇందులో 315 మండలాలు పూర్తి కరువు ప్రమాణాల పరిధిలోకి రాగా, మరో 43 మండలాల్లో తీవ్ర పంట నష్టం ముప్పు ఉందని, వాటన్నింటినీ కేంద్రానికి పంపే నివేదికలో చేరుస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే 324 మండలాల్లో భూగర్భ జలమట్టాలు ఆందోళనకరస్థాయికి పడిపోయాయని వివరించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల నిధులను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుత కరువు, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.7 వేల కోట్లతో కరువు పనులు చేపడుతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. తాగునీరు, గ్రామీణ ఉపాధి కల్పన కోసం జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ప్రత్యేక అత్యవసర నిధులు కేటాయించాలని ఆమె కోరారు.
ముందస్తు నివారణ చర్యలే లక్ష్యం: మంత్రులు
పరిస్థితులు విషమించిన తర్వాత కాకుండా ముందస్తు నివారణ చర్యలే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున రైతులు ప్రస్తుతానికి వరి సాగు చేయవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నీటి లభ్యతకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని, గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలను ఆదేశించారు.
కలెక్టర్లు ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని, సహాయక చర్యల్లో జాప్యం లేకుండా నిధులను అందుబాటులో ఉంచామన్నారు. మండలాలవారీగా భూగర్భ జల మట్టాలు, ఎండల తీవ్రతపై జిల్లాల్లో ప్రతి వారం గణాంకాలతో కూడిన నివేదికలు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచించారు. నీటి సంరక్షణ, ప్రభుత్వ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకోవాలని సూచించారు.
జిల్లాల్లో చెరువులు ఎండిపోతుండటంతో చేపల మనుగడ కష్టంగా మారిందని, అందుకే పెద్ద రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రతి గ్రామంలో పశువుల తాగునీటి తొట్టెలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు కరువు సెగ తగలకుండా చూడాలని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
