- ఎఫ్ఆర్బీఎం పరిమితి 0.5% సడలించాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేఖ
- ఎల్‌నినో సంక్షోభంలో రూ.10 వేల కోట్ల అదనపు అప్పు వస్తే రైతులు, కూలీలకు మేలు
- బడ్జెట్ రుణాల్లో ఇప్పటికే 70 శాతం వాడేసినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, వ్యవసాయ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రుణ పరిమితిని పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) చట్టం కింద రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత 3 శాతం రుణ పరిమితిని అదనంగా మరో 0.5 శాతం పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది.
వర్షాభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రస్తావించిన ప్రభుత్వం, ప్రత్యేక తీర్మానం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు సాగు, తాగు నీరు, నిరంతర విద్యుత్ అందించడం ప్రభుత్వానికి భారంగా మారిందని, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, అందువల్ల ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించి వెంటనే రాష్ట్రానికి రుణ పరిమితి పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
నిబంధనలు సడలించండి..
ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ లెక్కలను ప్రభుత్వం ఈ సందర్భంగా కేంద్రం ముందుంచినట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ (ఓఎంబీ) ఇతర మార్గాల ద్వారా దాదాపు రూ.79 వేల కోట్ల మేర బహిరంగ అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ కేంద్రం విధించిన సాధారణ 3% నిబంధన పరిధిలో ఇప్పటికే దాదాపు 70% మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా సమయం మిగిలి ఉండగానే, తీసుకున్న రుణాలు, వస్తున్న ఆదాయ అంతా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, గత రుణాల వడ్డీ చెల్లింపులు, రోజువారీ పరిపాలనా వ్యయాలకే సరిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం మేర సడలిస్తే.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ప్రాతిపదికన ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల మేర అదనపు రుణాన్ని మార్కెట్ నుంచి సేకరించే వెసులుబాటు దక్కుతుందని పేర్కొంది.
విపత్తు నిర్వహణ కోసమే..
అదనంగా సమకూరే రూ.10 వేల కోట్ల రుణ నిధులను పూర్తిగా ఎల్‌నినో విపత్తు నివారణ కోసమే వెచ్చించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కరువుతో అల్లాడుతున్న రైతులకు పంట నష్టపరిహారం అందించడం, ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పనులు కల్పించడం, అత్యవసర తాగు నీటి వ్యవస్థలను పునరుద్ధరించడం కోసమే ఈ నిధులను ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్తారని సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్రతను వివరించి, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంచాలని కోరే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది.
