ఓటీఎస్‌‌‌‌ దరఖాస్తు కారణంగా సమన్లు రద్దు చేయలేం..విచారించే అధికారం ఈడీకి ఉందన్న హైకోర్టు

ఓటీఎస్‌‌‌‌ దరఖాస్తు కారణంగా సమన్లు రద్దు చేయలేం..విచారించే అధికారం ఈడీకి ఉందన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మోసపూరితంగా ఫోర్జరీ పత్రాలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని ఓటీఎస్‌‌‌‌ కింద చెల్లించడానికి పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌‌‌‌లో ఉందన్న కారణంగా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉన్నప్పుడు బ్యాంకుతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవడం వల్ల క్రిమినల్‌‌‌‌ కేసు దర్యాప్తు ముగిసిపోదని, సమన్లు జారీ చేసి దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉందని పేర్కొంది. రూ.4.82 కోట్ల మేర బ్యాంకును మోసగించారంటూ 2021లో నమోదైన సీబీఐ కేసు ఆధారంగా 2026 ఆగస్టులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ పరుచూరి కుమార్‌‌‌‌ అలియాస్‌‌‌‌ కనుగంటి సురేశ్ కుమార్‌‌‌‌ మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. 

బలవంతపు చర్యలు  తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వలేం 

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బ్యాంకు రుణాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, దీని కోసం ఓటీఎస్‌‌‌‌ కింద దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈడీ దర్యాప్తుకు సహకరిస్తామని, అరెస్ట్‌‌‌‌ వంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు క్షత్రియ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ పేరుతో బ్యాంకుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి రుణం పొందడం ద్వారా రూ.4.82 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. అప్పటికే మరో బ్యాంకులో తాకట్టు పెట్టిన పత్రాలను సృష్టించి తిరిగి రుణం పొందారన్నారు. 

నిర్మాణ కంపెనీ పేరుతో తీసుకున్న రుణాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని వెల్లడించారు. విచారణ నిమిత్తం సమన్లు జారీ చేస్తే హాజరుకాకుండా కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి..  చట్టప్రకారం నిందితులను విచారణకు పిలిచి వాంగ్మూలం నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని అడిగే అధికారం ఈడీకి ఉందన్నారు. ఈడీకి అధికార పరిధి లేదనడానికి ఎలాంటి ఆధారాలను పిటిషనర్‌‌‌‌ చూపలేదని చెప్పారు. ఓటీఎస్‌‌‌‌ దరఖాస్తు పెండింగ్‌‌‌‌ ఉందన్న కారణంగా సమన్లను జారీ చేయలేమని, సమన్లను రద్దు చేయకుండా అరెస్ట్‌‌‌‌ లేదా బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలివ్వలేమంటూ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.