
హైదరాబాద్: రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా పబ్లిక్ ప్లేసుల్లో చాలా చోట్ల ఫ్రీగా వైఫై దొరుకుతుంది. ఉచితంగా వస్తుంది కదా అని చాలా మంది ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకుని తెగా వాడేస్తుంటారు. ఉచితమని కక్కుర్తి పడి ఫ్రీ వైఫై వాడితే.. చాలా ప్రమాదమని హెచ్చరించారు తెలంగాణ పోలీసులు. ఫ్రీ వైఫై వాడితే ఎలాంటి అనర్ధాలు ఎదురవుతాయో అవగాహన కల్పించారు.
తెలంగాణ పోలీసులు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తుంటారు. సైబర్ క్రైమ్స్, డిజిటల్ ఫ్రాడ్స్ ఇలా చాలా రకాల నేరాలపై ప్రజలను అలర్ట్ చేస్తుంటారు. తాజాగా ఫ్రీ వైఫై వాడితే ఎంత ప్రమాదమో అవగాహన కల్పించారు. ఈ మేరకు ఎక్స్ (ట్వట్టర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ఫ్రీ వైఫై అనే పదం వినడానికి చాలా తియ్యగా ఉంటుంది.
కానీ అసలు ఫ్రీ వైఫై ఎవరు సెటప్ చేస్తారు..? హ్యాకర్స్ మీ వ్యక్తిగత, ఆర్ధిక డేటాను దొంగలించేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేస్తారు. ఫ్రీ వైఫై ఉపయోగిస్తే మీ లాగిన్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ యాప్స్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు హ్యాకర్స్ చేతికి వెళ్తాయి. బ్యాంకింగ్, షాపింగ్‌కి సంబంధి లావాదేవీలు జరిపేటప్పుడు ఫ్రీ వైఫైను ఉపయోగించకండి. ఉచితంగా లభించే వైఫై ఉపయోగించి హ్యాకర్స్ ట్రాప్‌లో పడకండి’’ అని వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు తెలంగాణ పోలీసులు.
That #FreeWiFi might cost you more than you think…Watch this before you connect.#WiFiScam #CyberAwareness #ThinkBeforeYouClick#TelanganaPolice pic.twitter.com/Gvcd44Bebs
— Telangana Police (@TelanganaCOPs) June 14, 2025