కరీంనగర్ ,నిజామాబాద్  ములుగు జిల్లాల్లో.. సన్నబియ్యం అమ్ముకుని దొడ్డుబియ్యం ఇచ్చారు 

కరీంనగర్ ,నిజామాబాద్  ములుగు జిల్లాల్లో.. సన్నబియ్యం అమ్ముకుని దొడ్డుబియ్యం ఇచ్చారు 

సన్న బియ్యం సరఫరా చేయాల్సిన కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి, భారత ఆహార సంస్థ (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ)కి టోకరా వేశారు. సివిల్ సప్లై శాఖ కేటాయించిన సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచ్చిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కిలో రూ.50 వరకు అమ్ముకున్నారు. వాటి స్థానంలో బిహార్, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.28 చొప్పున కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి సరఫరా చేశారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ (ఈటీఎఫ్) తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ మూడు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేసి, ఆదివారం 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌‌‌‌‌‌‌‌లో మిల్లర్లతోపాటు సివిల్ సప్లై అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

కరీంనగర్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో అరెస్టులు

సివిల్ సప్లై శాఖ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌‌మెంట్) ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. కమిషనర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు మూడు ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసి 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాధాకృష్ణ రైస్ మిల్ యజమాని లెంకలపల్లి మధు, లక్ష్మీ సాయి ఇండస్ట్రీస్ యజమాని సంపత్, లక్ష్మీ వెంకటరమణ రైస్ మిల్ యజమాని వల్లాల మల్లికార్జున్, హుజూరాబాద్‌‌కు చెందిన వరలక్ష్మి రైస్ మిల్ యజమాని కల్లూరి కృష్ణమూర్తి ఉన్నారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీమాత రైస్ మిల్స్ యజమాని బాదం ప్రవీణ్‌‌తోపాటు లేపాక్షి రైస్ మిల్ యజమాని మోహన్, సాయిరాం రైస్ మిల్ యజమాని రఘోత్తం, వాసవి రైస్ మిల్ యజమాని శ్రవణ్, ఎల్‌‌ఎస్‌‌ఆర్ రైస్ మిల్ యజమాని హరినాథ్ కూడా అరెస్టయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మిల్లర్ల వివరాలు తెలియాల్సి ఉంది.